హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అడిగిన అనుమానాలకు అసంపూర్ణంగా సమాధానాలు ఇచ్చిన భట్టి.. ఇతర సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేయకుండానే శాసనమండలిలో తన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పి వెళ్లిపోయారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఎంఐఎం, బీజేపీ, సీపీఐ సభ్యులు పలు సందేహాలు లేవనెత్తారు. అన్నింటికీ సావధానంగా సమాధాలు చెప్తానన్న భట్టి.. ఆ తర్వాత వాటి ఊసే ఎత్తకుండా మండలికి వెళ్లిపోయారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టానికి వచ్చిన ఆదాయానికి మించి తమ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని తెలిపారు.
అయితే, అదనంగా ఖర్చు చేసిన నిధులను ఎక్కడినుంచి తెచ్చారనే విషయం చెప్పలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలనే ఉత్సాహంలో భట్టి విక్రమార్క అంకెల గారడీ ప్రదర్శించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రూ.1,57,302 కోట్లు సమకూరగా, కేంద్ర పన్నుల వాటా ద్వారా రూ.50,032 కోట్లు, అప్పుల ద్వారా రూ.73,299 కోట్లు సమకూరినట్టు వివరించారు. ఈ విధంగా మొత్తంగా రాష్ట్ర ఆదాయం రూ.2,80,603 కోట్లుగా ఉన్నదని తెలిపారు. ఇందులో వేతనాల కింద రూ.77,342 కోట్లు, అప్పులకు అసలు, వడ్డీల కింద రూ.88,009 కోట్లు, ఇతర స్కీంల కోసం రూ.1,34,063 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.
ఈ విధంగా మొత్తం రూ.2,99,414 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా వచ్చిన ఆదాయం రూ.2,80,603 కోట్లు కాగా, చేసిన ఖర్చును రూ.2,99,414 కోట్లుగా చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. అంటే వచ్చిన ఆదాయం కన్నా రూ.18,811 కోట్లు అదనంగా ఖర్చు చేసినట్టు వివరించారు. దీంతో ఆదాయానికి మించి ఖర్చు ఎలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోనీ, అప్పు తెచ్చారేమో అనుకుంటే తెచ్చిన అప్పులను కూడా మొత్తం ఆదాయంలోనే చూపించారు. అలాంటప్పుడు ఆదాయానికి మంచి ఖర్చు ఎలా సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో భట్టి విక్రమార్క బీఆర్ఎస్ను ఇరుకునపెట్టే ప్రయత్నంలో, తాము అంతా మంచిగనే చేశామని చెప్పుకొనే ప్రయత్నంలో అంకెల గారడీ సృష్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పులపై సీఎం మాదిరిగానే మళ్లీ అదే పాత కథ వల్లె వేశారు. తమ ప్రభుత్వం రూ.1,58,041 కోట్ల అప్పులు చేసిందని ఒప్పుకొన్నారు. తాము వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెడతామని, ప్రజలను ఊహల్లో, భ్రమల్లో, ఆశల పల్లకిలో ఉంచబోమని భట్టివిక్రమార్క చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఆదాయం ఎంత వస్తదో, ఎంత అవకాశం ఉంటదో అంతే చేద్దామని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
మేం వచ్చాక ప్రజల కోసం చాలా చేశాం
తమ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో చేసినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేశామని, నిరుద్యోగులకు 57,916 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. మహిళలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను అందజేస్తామని పేర్కొన్నారు. ప్రజలు అడిగితేనే ఎల్ఆర్ఎస్ ఇచ్చినట్టు వివరించారు. తమ ప్రభుత్వం ఎక్కడా భూములను అమ్మకానికి పెట్టలేదని తెలిపారు. గురుకుల స్కూళ్లన్నీ బాగున్నాయని తెలిపారు. విద్యార్థులకు రూ.829 కోట్ల ఫీజు బకాయిలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ.167.28 కోట్లు చెల్లించామని వివరించారు. త్వరలోనే ఓవర్సీస్ స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచనున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క ఎకరాకు కూడా అదనపు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు.