హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖను ఇప్పటికిప్పుడు క్యాబినెట్ నుంచి తప్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి పంపిన రాయబారం బెడిసికొట్టినట్టు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఒప్పించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్వవర్తిత్వం వహించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే క్షేత్రస్థాయి రాజకీయాలను పరిశీలించకుండా, ఒక వర్గం మాటలను నమ్మి బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళా మంత్రిని తొలగించటం సాధ్యంకాదని ఖర్గే తేల్చి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బర్తరఫ్ అనేది ఆశామాషీ వ్యవహారం కాదని, దేశవ్యాప్తంగా బీసీలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట. పార్టీ మీదగానీ, ప్రభుత్వం మీదగానీ సురేఖ నేరుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా? అని భట్టిని ప్రశ్నించినట్టు తెలిసింది. ‘క్రమశిక్షణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోకముందే ఎందుకంత తొందరపడుతున్నారు? అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం ప్రకటిస్తాం’ అని స్పష్టంచేయడంతో భట్టి విక్రమార్క కంగుతిన్నారని ప్రచారం జరుగుతున్నది. తాను అనవసరంగా ఇరుక్కపోయాననే ఆందోళనతో బయటపడినట్టు తెలిసింది.
బెంగళూరుకు వెళ్లిన డిప్యూటీ సీఎం
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ముదరిన వివాదం సీఎం రేవంత్‌రెడ్డికి పరువు సమస్యగా మారింది. దీంతో రాజకీయ రచ్చ లేకుండా సైలెంట్‌గా రాజీనామా చేయించే బాధ్యతను అనధికారికంగా భట్టికి అప్పగించారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం కొండా సురేఖ తరఫున ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని పిలిపించుకొని సుమారు గంటపాటు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సురేఖతో రాజీనామా చేయించాలని, ప్రత్యామ్నాయంగా కొండా మురళికి వేరే సర్దుబాటు చేస్తామని భట్టి ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై మురళి సీరియస్‌గా స్పందించారని, భట్టిపై ఎదురుదాడికి దిగారని చెప్తున్నారు.
‘మేము ఏం తప్పు చేశామని రాజీనామా చేయాలి? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రాణాలు పెట్టి నిలబడ్డ చరిత్ర మాది’ అంటూ ముఖం మీదే తెగేసి చెప్పినట్టు తెలిసింది. ‘మా బిడ్డ చేసిన వ్యాఖ్యలను మేమైమైనా సమర్థించామా?’ అని భట్టిని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ‘పదవి నుంచి తొలగించడం రేవంత్ తరం కాదు. హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటాం’ అని తెగేసి చెప్పినట్టు సమాచారం. దీంతో భట్టి విక్రమార్క ప్రత్యామ్నాయంగా బెంగళూరు దారిని ఎంచుకున్నట్టు సీఎం సన్నిహిత వర్గం చెప్తున్నది. కర్ణాటక రాష్ట్రం దేవదుర్గంలోని సింగరేణి గనుల క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో బుధవారం సాయంత్రం అప్పటికప్పుడే ప్రయాణం పెట్టుకున్నారట.
మీకెందుకు అంత తొందర?
భట్టి విక్రమార్క బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారని, అక్కడ ఆయనకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తలిగిందని సమాచారం. రేవంత్‌రెడ్డి వర్గం ఒత్తిడికి తలొగ్గేది లేదని ఖర్గే స్పష్టంచేసినట్టు తెలిసింది. ‘సురేఖ తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కానీ క్షేత్రస్థాయి నివేదికలు చూడకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేం’ అని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ‘తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ నిర్ణయాలను ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్ అధ్యయనం చేస్తున్నారు. ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు నివేదిక ఇస్తారు. కేసీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.
ఆయన ఢిల్లీకి చేరుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఖర్గే తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ అంశంలో తొందరపాటు నిర్ణయాలు అవసరం లేదని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారట. ‘తొందరపాటు నిర్ణయాలతో ఆమె మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో పార్టీకి బీసీలు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. దీనికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ఖర్గే తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో భట్టి కంగుతిని, సురేఖ అంశాన్ని ముగించినట్టు తెలిసింది. తాను ప్రత్యేకంగా ఈ అంశం చర్చించడం కోసం కర్ణాటకకు రాలేదని, దేవదుర్గం ప్రాంతంలోని బంగారు గనుల మీద సింగరేణి ఫోకస్ చేస్తున్నదని, గనిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సంస్థ తరఫున వచ్చినట్టు చెప్పి తప్పించుకున్నట్టు తెలిసింది.