హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’.. మహిళలు గౌరవింపబడే చోట దేవతలు కొలువై ఉంటారన్నది మన సంస్కతి చెప్పిన మాట. ఇది తెలంగాణలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఉమెన్ సేఫ్టీ వింగ్’ ఆడబిడ్డల రక్షణకు ‘భరోసా’ ఇస్తున్నది. బాధిత మహిళలకు కొండంత అండగా నిలబడుతున్నది. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే పురుడుపోసుకున్న ఈ వ్యవస్థ ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటున్నది. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు 2014 అక్టోబర్‌లో పోలీస్ శాఖ పరిధిలో ఉమెన్ సేఫ్టీ విభాగాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా షీటీమ్స్, భరోసా, సాహస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ మాడ్యుల్, గృహహింస మాడ్యుల్, ఎన్నారై సెల్, మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ వంటివి అందుబాటులోకి వచ్చాయి.
దేశంలోనే తొలిసారిగా ఇలాంటి వ్యవస్థలు తెలంగాణ నుంచి పురుడుపోసుకోవడంతో యావత్ మహిళా లోకం హర్షించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇవి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మహిళలకు సంబంధించి ఏదైనా ఆపద వస్తే వెంటనే ‘షీటీమ్స్’ గుర్తుకు వచ్చేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. 2016లో పురుడుపోసుకున్న భరోసా కేంద్రాలు మరో విప్లవాత్మక సంస్కరణ. దేశవ్యాప్తంగా ఈ కేంద్రాలకు ప్రశంసలు దక్కాయి. 2018 డిసెంబర్ 11న నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ భరోసా కేంద్రాలను ప్రశంసించింది. ఇటువంటి కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ ప్రశంసల వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ, ఉపాధి కల్పన పెరగడంతో పని చేసే మహిళల సంఖ్య కూడా పెరిగింది. పని ప్రదేశాల్లో మహిళలకు ఎదురయ్యే వేధింపులను అరికట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం 2023 మే 19న ‘సాహస్’ అనే (మాడ్యూల్) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పోష్ యాక్టును సమర్థంగా అమలు చేసేందుకు, పనిప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించేందు సాహస్ను ప్రవేశపెట్టారు. ఇందులో కంపెనీల యజమానులు, పోలీసుల సమక్షంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. వారి ద్వారా పని ప్రదేశంలో వేధింపుల నివారణపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మహిళలు సైబర్ నేరాలకు గురి కాకుండా, మ్యాట్రిమొనీ వెబ్సైట్ల నుంచి మోసపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మహిళల కోసం ‘సైబర్ సెల్’ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలపట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ‘సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫాం’ (సీఏపీ)ని తీసుకొచ్చింది. దీని ద్వారా 2,381 వివిధ పాఠశాలలు, గురుకులాల నుంచి 9,424 మంది విద్యార్థులకు, 4,722 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు క్షేమంగా ఉండేందుకు ఇక్కడివారి నుంచి కానీ, అక్కడ భర్త, వారి బంధువుల తరఫు నుంచి ఎలాంటి ఇబ్బందులు పడినా నేరుగా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు ఫిర్యాదు చేసే వెసులుబాటును కేసీఆర్ తీసుకొచ్చారు. ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని ఎన్నారై సెల్ విభాగం యాక్టివ్‌గా పనిచేస్తూ ఆడబిడ్డలను వేధిస్తున్న వారి భరతం పడుతున్నది. 2024లో 400 ఫిర్యాదులు స్వీకరించి 104 కేసులను సెటిల్చేశారు. తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ సంక్షేమం కోసం కూడా ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్’ను ఏర్పాటు చేశారు. ట్రాన్స్జెండర్లను వేధిస్తున్నవారి భరతం పడుతున్నారు. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని భరోసా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది జంటలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
తెలంగాణలో మహిళల భద్రత కోసం కేసీఆర్ దిశా నిర్దేశంలో తెలంగాణ పోలీస్‌శాఖ వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పాఠశాలల నుంచి కాలేజీలు, యూనివర్సిటీ వరకు మహిళల భద్రత.. నేరాలు జరుగుతున్న తీరు, అండగా ఉన్న చట్టాలు, ఫిర్యాదు చేసే విధానంపై అవగాహన కల్పించింది. కాలేజీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘సేఫ్టీ క్లబ్’లు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఆడపిల్లలకు అందాల్సిన పోలీసు, న్యాయ, ప్రజారోగ్యం, కౌన్సెలింగ్ వంటి సహాయాన్ని అందించేందుకు వారధిగా ఉంటున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకొని షార్ట్‌ఫిల్మ్‌లు, యాడ్స్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వినూత్న మార్గాల్లో విస్తృతమైన అవగాహన కల్పించారు. ఇది కేసీఆర్ చొరవనే సాధ్యమైందని పోలీసులు అంటుంటారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు హ్యాక్ఐ యాప్‌తో పాటు ‘విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా ప్రతి విషయంలో మహిళలను చైతన్యవంతులను చేస్తూ, వారి భద్రత కోసం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. దాని ఫలితంగానే మహిళలు తెలంగాణ అంటేనే భద్రతకు కేరాఫ్‌గా భావిస్తున్నారు.
చిన్నారుల మొదలు అన్ని వయసుల లైంగికదాడి బాధితులకు అండగా ఉండేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని ‘భరోసా’ విభాగం పనిచేస్తున్నది. బాధితులను అక్కున చేర్చుకోవడం, సాంత్వన కలిగించడం, వివరాలు తీసుకొని ఆధారాలు సేకరించి వారితో భరోసా టీమ్ కేసు ఫైల్ చేయిస్తుంది. ఒక్కసారి భరోసా టీమ్ కేసు నమోదు చేస్తే, నిందితులకు శిక్ష పడటం తప్ప మరో మార్గం లేదన్నట్టుగా పటిష్ఠ వ్యవస్థను రూపుదిద్దారు. నిరుడు 52 మందికి శిక్షలు పడేలా చేయగలిగారు. ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్'(ఐటీటీఎస్దో) ద్వారా లైంగికదాడి కేసుల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేయడం భరోసా కేంద్రాల్లోని ప్రత్యేకత. ఈ భరోసా కేంద్రాల్లో రిసెప్షనిస్టు మొదలుకొని, కేసు వాదించే లాయర్లు, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు, సైకాలజిస్టుల వరకు నిరంతరం అందుబాటులో ఉంటా రు. దీంతో అద్భుతమైన ఫలితాలు రావడంతో కేసీఆర్ ప్రభుత్వం భరోసా కేంద్రాల ను అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరింపజేసింది. ప్రస్తుతం 12 జిల్లాల్లో భరోసా కేంద్రాలు బాధితులకు సేవలందిస్తుండగా.. మరో 14 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. వీటిల్లో 11 భరోసా కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. 29 జిల్లాల్లో వీటి నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.15కోట్లను మంజూరు చేసింది.
మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్’ (ఏహెచ్‌టీ) మాడ్యూల్ తీవ్రంగా శ్రమిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 30 ఏహెచ్‌టీ యూనిట్ల నుంచి తన పనిని విజయవంతంగా నిర్వర్తిస్తున్నది. ఏటా మిస్సింగ్ కేసులను పరిష్కరించడంలో ముందుంటున్నది. 2023 జూలై నాటికి మిస్సింగ్ కేసుల ట్రేసింగ్‌లో తెలంగాణదే అగ్రస్థానం.
తెలంగాణ పోలీసులు, ఏహెచ్‌టీ మాడ్యూల్ సిబ్బం ది విశేష కృషి వల్ల తప్పిపోయిన కేసులలో ట్రేసింగ్ 87శాతంగా నమోదైనట్లు నాటి ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. తెలంగాణలో నమోదైన ట్రేసింగ్ సగటు దేశంలోని జాతీయ సగటుకంటే చాలా ఎక్కువగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. జాతీయస్థాయిలో బాలికల ట్రేసింగ్ 62 శాతంగా ఉండగా.. మహిళల ట్రేసింగ్ 53శాతంగా నమోదైందన్నారు. తెలంగాణ పోలీసుల అలుపెరగని కృషి వల్లే ట్రేసింగ్‌లో 87శాతంతో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నట్లు నాడు శిఖాగోయెల్ వెల్లడించారు.