Bharat Summit | హైదరాబాద్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఈ నెల 25, 26 తేదీల్లో ‘భారత్ సమ్మిట్-2025’ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సదస్సులో 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని ప్రభుత్వమే ప్రకటించింది. 100 పార్టీల తరఫున 40 నుంచి 50 మంది మంత్రులు, 50 మంది సెనేటర్లు, ఎంపీలతోపాటు రాజకీయ పార్టీల అధినేతలు పాల్గొంటారని ప్రకటించింది. కానీ, ఇది పేరుకే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచస్థాయి సదస్సు.. అందులో పాల్గొనేవారు, ప్రసంగించే కీలక వ్యక్తులంతా కాంగ్రెస్ అగ్రనేతలే. సదస్సు ఆరంభం రోజున లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత రాహుల్‌గాంధీ కీలక ప్రసంగం చేస్తారు.
ముగింపు రోజున కాంగ్రెస్ ఎంపీలైన ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ ఉపన్యసిస్తారు. అంటే ఈ సదస్సు కాంగ్రెస్ అగ్రనేతల ప్రసంగంతో మొదలై, కాంగ్రెస్‌లో కీలక నేతల ప్రసంగంతో ముగుస్తుంది. దీంతో ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రారంభ, ముగింపు సభల్లో మాట్లాడేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు కాకుండా వేరే ప్రముఖులు ఎవరూ దొరకలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులో భాగంగా ప్రపంచ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం, ద్వైపాక్షిక బంధాలపై చర్చలు జరగనున్నాయి. కానీ, కార్యాచరణ, అందులో పాల్గొనే అతిథులను పరిశీలిస్తే మాత్రం ఇది ప్రపంచ సదస్సు కాదు.. పక్కా కాంగ్రెస్ సదస్సు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల భారత్ సమ్మిట్ సదస్సు సన్నాహక సమావేశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కీలక నేత శ్యాంపిట్రోడ ఆన్లైన్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా హాజరయ్యారు. ఈ విధంగా సమావేశాలు మొత్తం పార్టీ నేతలతో నిర్వహిస్తూ, ప్రభుత్వం పేరు చెప్పుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారని, ప్రజల సొమ్మును పార్టీకోసం ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే? భారత్ సమ్మిట్ సదస్సు కార్యక్రమ వివరాలను వెల్లడించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన నివాసమైన ప్రజాభవన్‌లో ఎంపిక చేసిన మీడియాతో భారీస్థాయిలో విందు ఇవ్వడం గమనార్హం.