హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సొంత డెయిరీని ఏర్పాటుచేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ లేఖ రాశారు. రోజుకు రూ.5 కోట్ల ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీ ఎందుకు ఏర్పాటు చేయలేమని ప్రశ్నించారు. ప్రభుత్వం డెయిరీ ఏర్పాటుకు సిద్ధమయితే తాను వెయ్యి గోవులను ఇవ్వడంతోపాటు లక్ష గోవులను సమకూర్చే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. టీటీడీ పాలక మండలిలో చైర్మన్ సహా సభ్యులంతా ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈబీసీలపై కాంగ్రెస్ వైఖరేంటి?: రవీందర్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఈబీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరేమిటో స్పష్టం చేయాలని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని ఈబీసీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వీ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్రవర్ణ పేదలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొందరు మేధావులు పార్టీలో విభేదాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈబీసీల జోలికొస్తే దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఆయన హెచ్చరించారు.