హనుమకొండ, నవంబర్ 13 : ఈ నెల 20 నుంచి 25 వరకు ఫిలిప్పీన్స్దేశంలో జరగబోయే ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో న్యాయనిర్ణేతగా వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. జేఎన్‌ఎస్‌లోని జిమ్నాస్టిక్స్ అకాడమీ పూర్వవిద్యార్థి భరద్వాజ్ పలు జాతీయస్థాయి పోటీల్లో మన రాష్ట్రానికి ప్రాతినిద్యం వహించి ఎన్నో పతకాలు సాధించారు. ఆ ప్రతిభ ఆధారంగా క్రీడాకారుల కోటాలో ఇండియన్ రైల్వేలో ఉద్యోగం సాధించి కాజీపేటలో విధులు నిర్వహిస్తున్నారు.
ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరించి అంతర్జాతీయ న్యాయనిర్ణేతగా వ్యవహరించేందుకు అర్హత సాధించారు. జనవరి 2025 జపాన్‌లో ఇంటర్నేషనల్ జడ్జీల కోర్సులో పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 94.7 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ మార్చి నెలలో తుర్కెయేలో జరిగిన ప్రపంచకప్ పోటీల్లో న్యాయనిర్ణేతగా పాల్గొనే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
భరద్వాజ్ పనితీరును పరిశీలించి మళ్లీ ఫిలిప్పీన్స్‌లో జరిగే ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు, ఇండియన్ రైల్వేబోర్డుకు తెలియజేసి కావాల్సిన అనుమతులు మంజూరు చేశారు. ఒకే సంవత్సరంలో రెండు ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొని అవకాశం పొందిన భరద్వాజ్‌ను వరంగల్ జిమ్నాస్టిక్స్అసోసియేషన్ అధ్యక్షుడు నెమరుగొమ్ముల రమేశ్‌రావు, సెక్రటరీ సాంబయ్య, ఇతర సభ్యులు మధుసూదన్, శ్రీనివాస్, సోమరాజు, కమలాకర్‌తో పాటు రాష్ట్ర కార్యదర్శి ఆకుల సోమేశ్వర్ అభినందించారు.