కొడంగల్, ఏప్రిల్ 11 : కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సీఎం ఇలాకా అయిన కొడంగల్ నియోజకవర్గంలో సమ్మెకు దిగారు. కొడంగల్ శివారులోని మిషన్ భగీరథ పథకం సంప్‌హౌస్ వద్ద కార్మికులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వీరి సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు. కార్మికుల సమ్మెతో 220 గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కోనున్నాయి.
కొడంగల్, ఏప్రిల్ 11 : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల స్వీపర్లు ఆందోళనకు దిగారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ‘కడా’ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందన కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. టీఎఫ్‌టీయూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఏండ్లుగా పనిచేస్తున్న తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, 61 ఏండ్లు నిండిన స్వీపర్లకు రూ.15 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ అందించాలని డిమాండ్ చేశారు.