అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కుర్మపల్లి నీళ్ల కష్టాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇక్కడ భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు మళ్లీ భగీరథ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కరీంనగర్, జనవరి 28 (నమస్తే తెలంగాణ)/గంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్‌కు ప్రతి ఏటా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని 57 చెరువులను నింపుతున్నారు. ఈ నీటితో ఆరు మండలాల్లోని దాదాపు 27 వేల ఎకరాల్లో పంటలు పుష్కలంగా పండేవి. గతంలో జనవరి మొదటి, రెండోవారంలోనే నీళ్లు విడుదల చేసేవారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో పుష్కలంగా నీళ్లున్నా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద పైప్‌లైన్ మరమ్మతు సాకుతో నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీళ్లివ్వడం లేదు.
ఎమ్మెల్యే చెప్పడంతోనే నార్లు
నీళ్లిస్తాం.. నార్లు పోసుకోమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పడంతోనే తామంతా నార్లు పోసుకున్నామని రైతులు చెప్తున్నారు. ఇప్పుడేమో సమయానికి నీళ్లు వదలకపోవడంతో నార్లు ముదిరిపోతున్నాయని, భూగర్భ జలాలు ఇంకిపోతుండడంతో బావుల్లోనూ నీళ్లు ఉండడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే ఆ మాట చెప్పకపోయి ఉంటే తాము నార్లు వేసుకుని ఉండేవాళ్లం కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుక్కుల కోసం ట్రాక్టర్లకు వేలకువేలు ఖర్చు చేశామని, నార్లకు రెండుసార్లు మందులు వాడామని, ఇప్పుడీ పెట్టుబడి అంతా భారంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు రావని మొదటే చెప్పి ఉంటే బావుల కింద ఉన్న నీటితోనే ఎంతోకొంత సాగుచేసుకుని ఉండేవారమని కుర్మపల్లి రైతులు పేర్కొన్నారు.
కేసీఆర్ చొరవతో సస్యశ్యామలం
2016లో కేసీఆర్ ప్రభుత్వం ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడం ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంత భూములు సస్యశ్యామలమయ్యాయి. రైతులు ఏటా రెండు పంటలు పండించుకుంటున్నారు. ప్రతి పసలుకు రైతుల అవసరాన్ని గుర్తించి నీటిని విడుదల చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకపోవడంతో బావుల్లో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. మరోదారి లేక రైతులు ఇప్పుడు క్రేన్లతో బావుల్లో పూడిక తీసుకుంటున్నారు. కుర్మపల్లిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
దారుణంగా కుర్మపల్లి పరిస్థితి
నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్మపల్లికి ప్రతి సీజన్‌కు అవసరమైన నీళ్లు వచ్చేవి. చెరువులు నింపుకుని రైతులు పంటలు సాగు చేసుకునేవారు. నారాయణపూర్‌లో ఇప్పుడు 20 శాతం నీళ్లు కూడా అందుబాటులో లేక పోవడంతో పైనున్న గ్రామాల రైతులే సాగునీరు లేక అల్లాడుతున్నారు. చివరి గ్రామమైన కుర్మపల్లి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
సాగునీటి కష్టాలు రైతులను వేధిస్తున్నాయి. నీళ్లిస్తామని ఎమ్మెల్యే సత్యం చెప్పడంతో నార్లు వేసిన రైతులు, ఇప్పుడు నీళ్లిచ్చినా నాట్లు వేసే పరిస్థితి లేదని, అవన్నీ ముదిరిపోతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా నీళ్లిస్తే వేసిన కొద్దిపాటి పంటలనైనా కాపాడుకుంటామని రైతులు కోరుతున్నారు. ఇంకొందరు రైతులు దున్నిన దుక్కులను, నారు మళ్లను వదిలేసుకుంటున్నారు.
గ్రామానికి చెందిన రైతు ఇరుమల్ల కొంరయ్య రూ.లక్ష ఖర్చుచేసి పూడిక తీయడమే కాకుండా బావిలో సైడ్ బోరు వేయించినా సరిపడా నీళ్లు రాకపోవడంతో 20 గుంటల పొలాన్ని వదిలేశాడు. దానె సతీష్ అనే మరో యువరైతు రూ. 30 వేలు ఖర్చుచేసి పూడిక తీయించినానీళ్లు సరిపోవడం లేదు. ఆదివారం నుంచి నీటిని విడుదల చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించినా అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. రిజర్వాయర్ నిండాలంటే వారం నుంచి పది రోజులు పడుతుందని, అప్పటి వరకు పంటలను ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదని కుర్మపల్లి, వెంకటాయపల్లి గ్రామాల రైతులు వాపోతున్నారు.
ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలి
నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుర్మపల్లి వద్ద ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయని నమ్మి ఓట్లు వేసిన రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి నార్లు పోసి, నాట్లు వేస్తే నీళ్లు లేక ఎండిపోతున్నాయని తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు వెంటనే నీళ్లివ్వకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని రవిశంకర్ హెచ్చరించారు.
ఇన్నేండ్లు క్రేన్ల అవసరమే రాలే
కేసీఆర్ సర్కారు ఉన్నన్ని రోజులు రందిలేకుండా మూడెకరాల్లో వరి సాగుచేసుకున్న. ఇన్నేండ్ల కాలంలో మాకు బాయిలల్ల క్రేన్లతో పూడికతీసే అవసరమే రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగొద్దులు కాలేదు కానీ నీళ్ల కోసం మస్తు గోసైతంది. పొలాలను చూస్తే దుఃఖమైతంది. పెట్టుబడి కూడా రాకుండా అయితంది. ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇటు ముఖానే రాలే. ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇడుస్త లేరు. రేపు, మాపు అనుకుంట దాటేస్తున్రు. నీళ్లు ఇత్తరా? ఇయ్యరా? పురాగ చెప్తలేరు.
– మొట్టె ఓదెలు, కుర్మపల్లి, కరీంనగర్
కాంగ్రెసోళ్ల మాటలిని బోర్లవడ్డం
ఇప్పుడున్న ఎమ్మెల్యే మా కుర్మపల్లికి అచ్చి నీళ్లు ఇత్త అని చెప్పిండు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఎటుగాకుంట చేసిండు. నార్లకు ముంచిండు. రైతుబంధు అన్నడు. 4 వేల పింఛను అన్నడు. మొత్తం డూబిలికేట్ జేసిండు. ఏ రాజ్యాన ఉంటడో తెలువది. ఫోన్జేత్తె లావట్టడు. కాంగ్రెసోళ్ల మాటలు విని బోర్లవడ్డం. నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్లు ఎక్కడ పోయినయో చెప్పాలె. రెండు మడులు ఏసుకుంటె నీళ్లు లేక ఎండిపాయే.
– ఇరుమల్ల భూదమ్మ, కుర్మపల్లి
బావిలో పూడిక తీసి ఏం ఫాయిదా?
నారాయణపూర్ నుంచి నీళ్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్న ఐదెకరాల్లో ఈసారి మూడెకరాల్లో నాట్లు వేశా. నీళ్లు రాక పంట ఎండిపోవడంతో వారం కిందటే రూ. 30 వేలు ఖర్చు చేసి బావిలో పూడిక తీయించా. నారాయణపూర్ డీ-4 కాలువకు ఆనుకుని బావి ఉండడంతో కొంత ఊట వస్తోంది. వారం పది రోజుల్లో కాలువ నీళ్లు రాకపోతే ఈ మాత్రం నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సకాలంలో నీళ్లు వస్తే మాకు ఈ కష్టాలు ఉండేవి కాదు.
-దానె సతీశ్, కుర్మపల్లి
ఎమ్మెల్యే నీళ్లిస్తనని చెప్పిండు
ఓట్లపుడు మా ఊళ్లెకు వచ్చినపుడు ఇప్పటి ఎమ్మెల్యే నారాయణపూర్ నీళ్లిస్తనని చెప్పిండు. డిసెంబర్ పత్తారీఖు సందే ఇస్తమన్నడు. ఇప్పటి వరకు నీళ్లు రాలే. కుర్మపల్లెకాడి బాయిల పూడిక తీయించి సైడ్ బోరు ఏయించిన. లక్ష రూపాయలైనయ్. అయినా నీళ్లస్తలేవని నాటేసిన 20 గుంటల మడి ఇడ్సిపెట్టిన. ఎంకటయపల్లి శివారుల సుతం నాకు భూమి ఉన్నది. ఇక్కడి బాయిల సుతం నీళ్లు ఎన్కకువడ్తున్నయి. రేపుమాపైతే ఆయింతకు నీళ్లచ్చేతట్టు లేవు. కేసీఆర్ ఉన్నపుడు గిట్ల ఎప్పుడు కాలే. ఓడిపోయి రెండు నెలలన్న కాకపాయే మా రైతులకు కష్టాలు మొదలయ్యే.
– ఇరుమల్ల కొంరయ్య, కుర్మపల్లి రైతు
మూడొద్దులకో మడి పారుతంది..
నాకున్నది రెండెకరాలే. నారాయణపూర్ నీళ్లస్తయని నమ్మకంతోని అ యింత నాటేసిన. ఇప్పటి వరకు నీళ్లు రాలే. బావిల నీళ్లు అడుగువడ్తన్నయి. మూడొద్దులకో మడి పారిచ్చుకుంటన్న. ఆఖరి మడి పారేవరకు మొదటి మడి ఎండుతంది. మా ఊళ్లె కొందరు నారాయణపూర్ చెరువుకు మోటర్లు పెట్టి పొలాలు పారిచ్చుకుంటండ్రు. ఇట్ల ఎన్ని దినాలు పారిచ్చుకుంటం. ఏసిన పంట చేతికి రావాల్నంటే నారాయణపూర్ చెరువు నింపాలే.
– బైరి నర్సయ్య, లక్ష్మీదేవిపల్లి రైతు