టేకులపల్లి/ ఆళ్లపల్లి, సెప్టెంబర్ 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నిరసన సెగ తగిలింది. రాయిపాడుకు చెందిన రైతు ఊకె నాగేశ్వరరావు టేకులపల్లి మండలం మురళిపాడు బీట్లో 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఎకరం భూమిలో పత్తి సాగుచేశాడు. బుధవారం రాత్రి అటవీ శాఖ అధికారులు సిబ్బందితో వచ్చి పట్టా భూమిలో ఉన్న పత్తి మొక్కలను ధ్వంసం చేశారు. మండలంలో గురువారం పర్యటించిన ఎమ్మెల్యేను బాధిత రైతులు అడ్డుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
రైతు వేదిక ముందు పత్తి పంటను రోడ్డుపై వేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చిస్తామని, వారికి శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టేకులపల్లి రేంజర్ ముక్తార్ హుస్సేన్ను వివరణ కోరగా.. రాయిపాడుకు చెందిన రైతు తనకున్న భూమి పరిధి దాటి ఆక్రమించాడని, దీనిపై చాలాసార్లు రైతుకు సమాచారం ఇచ్చామని తెలిపారు. కొత్తగా పోడు చేస్తున్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం అందించామని వివరించారు.