భద్రాచలం, ఏప్రిల్ 2: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఉదయం అంతరాలయంలోని మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు ఆలయంలో భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీచేశారు. ఉత్సవమూర్తులకు, నిత్యకల్యాణమూర్తులకు ఉత్సవారంభ స్నపనం నిర్వహించారు.
ఈ నెల 6 నుంచి నవాహ్నిక మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 10న మిథిలా ప్రాంగణంలో శ్రీసీతారామ స్వామివారి కల్యాణోత్సవాన్ని, 11న మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు స్వామివారికి సాయంకాలం ఆరాధన, 5:30 బేడా మండపంలో వేంచేయింపు, 6 గంటలకు దర్బారు సేవలు చేపట్టారు. అనంతరం వేద పండితులు చెన్నావఝల వెంకటేశ్వర అవధాని శుభకృత్ నామ సంవత్సరం నూతన పంచాంగ శ్రవణం పఠించారు. రామయ్య, సీతమ్మవార్ల ఆదాయ వ్యయాలు వివరించారు.
రేపటినుంచి ఆన్లైన్లో గదుల బుకింగ్
శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం సందర్భంగా భద్రాచలానికి వచ్చే భక్తులు.. ఈ నెల 4 నుంచి ఆన్లైన్ ద్వారా లాడ్జిల్లో గదులను బుక్ చేసుకోవచ్చని భద్రాచలం సబ్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. www.bhadrachalam online.com ద్వారా సోమవారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.