భద్రాచలం, మార్చి 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్‌ను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండగా ఈ నెల 26న కుప్పకూలి ఇద్దరు మేస్త్రీలు మృతిచెందిన విషయం విదితమే. 27న తెల్లవారుజామున కామేశ్వరరావు అనే మేస్త్రీని కొన ఊపిరితో బయటకు తీయగా.. చికిత్స పొందుతూ గంట వ్యవధిలోనే మృతిచెందాడు. 28న ఉపేందర్ అనే మరో మేస్త్రీ మృతదేహాన్ని సహాయక సిబ్బందికి వెలికి తీశారు. అనుమతులు లేకుండా ఏకంగా ఆరు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టడం, ఇద్దరి మృతికి కారణమైన యజమాని శ్రీపతి శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన భద్రాచలం పోలీసులు.. అతడిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.