హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్‌ను సైబర్ నేరగాళ్లు మోసాలకు ఆసరాగా చేసుకుంటున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ ప్రజలను హెచ్చరించారు. ఆథరైజ్డ్ వెబ్సైట్లు, యాప్‌లను వినియోగించాలని, ఉచితంగా రెట్రో ఫొటోలు తయారు చేసి పెడతామంటూ చేసే ఆకర్షణీయమైన ప్రకటనలు, సందేశాలు చూసి మోసపోవద్దని సూచించారు.
ఆ ప్రకటనల్లోని లింకుల ద్వారా, వాటి నుంచి పంపే ఏపీకే ఫైళ్ల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో రెట్రో ట్రెండ్ పేరుతో వచ్చే వాట్సాప్ ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయొద్దని, ఆయా వెబ్సైట్లలో చూపించే ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయొద్దని నెటిజన్లను హెచ్చరించారు. ఇలాంటి యాప్‌లను ఇన్స్టాల్ చేయగానే, అవి మొబైల్లోని ఎస్ఎంఎస్, ఓటీపీలు, కాంటాక్టులు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తాయని చెప్పారు.
ఈ సమాచారంతో సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు, గుర్తింపు దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. తెలియని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించారు. అధికారిక యాప్ స్టోర్లు కాకుండా థర్డ్‌పార్టీ వెబ్సైట్లు, ఏపీకే ఫైళ్లతో పెనుప్రమాదం పొంచి ఉన్నదని పేర్కొన్నారు. ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.