Cyber Crime | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన 31 ఏండ్ల ఓ ప్రైవేటు ఉద్యోగి శ్రీశైలం దర్శనానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి వైశ్యసత్రంలో గది బుక్ చేసుకున్నాడు. గదికి రూ.1,000 కాగా ఆ మొత్తం ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. అదనంగా రూ.180 జీఎస్టీ చెల్లించాలంటూ కాల్ వచ్చింది. కానీ జీఎస్టీ చెల్లించనందున రూమ్ బుక్ కాకపోవడంతో, తాను చెల్లించిన మొత్తాన్ని రిటర్న్ చేయాలని కోరాడు. రీఫండ్ ప్రక్రియ కోసం రూ.1 చెల్లించాలని అవతలి వ్యక్తి అడగగా చెల్లించాడు. ఆ తర్వాత తన అకౌంట్లో లక్షరూపాయలు మాయం కావడంతో కంగుతిన్నాడు. కాల్ చేసిన వ్యక్తులను సంప్రదించగా.. వారు స్పందించకపోవడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
ఏవైనా టూర్లు, సౌకర్యాల పేరుతో వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ప్రకటనలు చూసి నమ్ముతున్న జనాలు ఆన్లైన్లో ముందస్తు చెల్లింపులు చేస్తున్నారు. కొన్ని ఫేక్ ట్రావెల్ ఏజెన్సీలు గూగుల్ రిజిస్టర్లతో కూడిన నకిలీ లింకులు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. బాధితులు తాము అంతదూరం వెళ్లి సదుపాయాలు తీసుకోవడం కష్టం కాబట్టి ముందుగానే ఆన్లైన్లో రిజర్వ్ చేసుకుని వెళ్తే ప్రయాణం సుఖవంతమవుతుందని భావిస్తున్నారు. అయితే ఆన్లైన్లో తాము బుక్ చేసుకున్న తర్వాత ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడం, ఫోన్‌నెంబర్లు పనిచేయకపోవడం, రీఫండ్ అవకాశం లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే స్పాన్సర్డ్ యాడ్స్‌ను నమ్మవద్దని, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల ద్వారానే బుకింగ్స్ చేసుకోవాలని సైబర్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. సంక్షిప్తమైన యూఆర్ఎల్ (bit.ly, tinyurl) లను నమ్మవద్దని, ఏదైనా సమస్య వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
రోజుకో తరహా కొత్తరకం మోసాలు చేస్తూ వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్ తాజాగా ఆధ్యాత్మిక పర్యాటకంపై కన్నేశారు. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులను టార్గెట్‌గా చేసుకుంటూ మోసాలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఈ తరహా నేరాలు జరుగుతుండడంతో సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ అప్రమత్తమైంది. ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఒక్క తెలంగాణ నుంచే ఏటా రూ.700 కోట్లు కొల్లగొడుతున్నట్టు తెలిపింది.