హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.2985 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆల్కహాల్ బేవరేజెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది. చెల్లింపుల్లో జాప్యం చేస్తే మద్యం సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్, హీనెకెన్, డియాగియో, ఫెర్నార్డ్ రిచర్డ్, కార్ల్స్‌బర్గ్ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. పెండింగ్ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు సీనియర్ అధికారులను సంప్రదించినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు.
రూ.2985 కోట్లలో రూ.2,029 కోట్లు నిరుడు ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, రూ.956 కోట్లు ఇటీవలి ఓవర్‌డ్యూ పేమెంట్స్ అని లేఖలో వివరించారు. నిరుడు ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని కోరారు. టెండర్ నిబంధనల ప్రకారం ప్రస్తుత బకాయి చెల్లింపులను 45 రోజులకు తగ్గించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడిని తగ్గించడానికి ముందస్తు ఎక్సైజ్ సుంకాన్ని 1శాతానికి తగ్గించాలని లేఖలో పేర్కొన్నారు.