హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల కలకలం సృష్టించిన బెట్టింగ్యాప్స్ కేసును తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్టు తెలిసింది. మియాపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లకు తోడు, సైబర్‌క్రైమ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ బెట్టింగ్యాప్స్ మాఫియాపై దర్యాప్తు చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రెటీలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌పై కూడా కేసు నమోదైనట్టు తెలిసింది.
ఇప్పటికే యూట్యూబర్లు, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. వీరిలో పలువురు పోలీసుల విచారణకు హాజరయ్యారు. మరింకొందరు విచారణకు హాజరవ్వాల్సి ఉండగా.. ఇంకొందరు పరారీలో ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల మూలాలు విదేశాల్లో ముఖ్యంగా చైనా, దుబాయ్‌లలో ఉండటంతో కేసు విచారణను సీఐడీకి అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. సైబర్ సెక్యూరిటీ విభాగానికి డైరెక్టర్‌గా, సీఐడీ డీజీగా శిఖాగోయెల్ నేతృత్వంలోనే ఈ బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు కొనసాగుతుందని తెలిసింది.
ఆ కేసులను కొట్టేయండి: విష్ణుప్రియ
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన వివాదంలో యాంకర్, నటి బీ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. ఆ యాప్‌లను ప్రమోట్ చేసినట్టు తనపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారులు బెట్టింగ్ యాప్‌లు, కంపెనీలపైనే ఆరోపణలు చేశారని, తనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని, తనపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరలేదని ఆమె వివరించారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత రూ.వేల కోట్లలో నష్టపోతున్నట్టు ఫిర్యాదుదారులు పేర్కొన్నారని, ఇది మరింత విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని మాత్రమే వారు కోరారని తెలిపారు. ఈ వ్యవహారంలో తనను నేరుగా నిందితుల జాబితాలో చేర్చలేదని, అందువల్ల ఈ కేసుల నుంచి తన పేరును తొలగించాలని విష్ణుప్రియ కోరారు.