హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): డ్రగ్ డిటెక్షన్ కిట్లతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆబ్కారీ భవన్లో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ఎక్సైజ్ సిబ్బంది టీజీ న్యాబ్‌తో కలిసి పనిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తనిఖీలు జరుపుతున్నప్పుడు మహిళలు ఉంటే మర్యాదగా వ్యవహరించాలని, మహిళ కానిస్టేబుళ్లతో తనిఖీలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి, టీజీ న్యాబ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో శనివారం నుంచి మూడు రోజులపాటు పీవోడబ్ల్యూ రాష్ట్ర ఏడో మహాసభలను నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి మంగ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం నగరంలో ర్యాలీ, బహిరంగసభ, సెప్టెంబర్ 1న రాష్ట్ర మహాసభల ప్రారంభం, 2న ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. జనాభా ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, హత్యాచారాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలు చేయాలనే డిమాండ్లను చర్చిస్తామని తెలిపారు. ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షురాలు అపర్ణ, ఏపీ పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎం లక్ష్మి హాజరవుతారని తెలిపారు.
న్యాయవాదిపై దాడిని ఖండించిన బార్ కౌన్సిల్
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డిలో న్యాయవాది చైతన్యపై జరిగిన దాడిని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఖండించింది. ఈ ఘటనపై బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కే సునీల్‌గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు పీ విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం బార్ కౌన్సిల్ సభ్యులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. చైతన్యపై దాడికి పాల్పడినవారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.