తెలంగాణచౌక్/రుద్రంగి, జనవరి 12: ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతమైంది. ఈ నెల 9న బస్సులో పందెంకోడి దొరికిన విష యం తెలిసిందే. 3 రోజులపాటు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్న కోడిని శుక్రవా రం కరీంనగర్ డిపో-2 మేనేజర్ మల్లయ్య ఆధ్వర్యంలో బ్లూక్రాస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తూము నారాయణకు అప్పగించారు. శుక్రవారం కోడిని వేలం వేయాలని అధికారులు మొదట నిర్ణయించారు. కానీ, జంతు సంరక్షణ సంస్థ సభ్యులు కొంత మంది వచ్చి వన్యప్రాణుల చట్టం ప్రకారం కోడిని వేలం వేయరాదని, జంతు సంరక్షణ కేంద్రాలను అప్పగించాలని ఆర్ఎం సుచరిత దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారు. వెంటనే ఆర్టీసీ అధికారులు ఆ కోడిని బ్లూ క్రాస్ సొసైటీకి అప్పగించారు. అప్పటికే వేలం ప్రకటన చూసి పలువురు డిపో-2కు చేరుకున్నారు. బ్రీడింగ్ కోసం పందెం కోడిని దక్కించుకునేందుకు రామకృష్ణ అనే వ్యక్తి మహాదేవపూర్ నుంచి వచ్చారు. నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు తరలివచ్చారు.
వేలం ఆపండి.. ఆ కోడి నాదే
వేలం ఆపండి ఆ కోడి తనదేనంటూ ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తన పేరు వల్లపు మహేశ్ అని, తనది ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి అని చెప్పారు. ఉపాధి నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పందెం కోడిని తీసుకొని నెల్లూరుకు వెళ్తుండగా, బస్సులో మరిచిపోయానని, దయచేసి వేలం ఆపాలని, ఆ కోడి తనదేనని, ఆధారాలు ఉన్నాయంటూ కోరిన వీడియో వైరల్గా మారింది.