హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు ఇటీవల కేంద్రహోంశాఖ ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రం ట్రోఫీని బహూకరించింది. హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ(ఎన్ఐఎస్ఏ) అకాడమీ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2020-21 సంవత్సరానికి కేంద్రం ఈ ట్రోఫీని ప్రకటించింది. అయితే ఇటీవల ఢిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా చేతుల మీదుగా నిర్వహించిన అవార్డుల ఫంక్షన్కు ఆనంద్ వెళ్లలేకపోయారు. ఆయన తరఫున ఎన్ఐఎస్ఏ డీఐజీ శ్రీనివాస్ అవార్డును స్వీకరించారు. ఈ ట్రోఫీని సీవీ ఆనంద్కు బుధవారం హైదరాబాద్ పోలీస్ కార్యాలయంలో అందజేశారు.