జనగామ, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఉత్తమ జీపీలకు రూ. 10 లక్షల నజరానాను బహుమానంగా ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ పంచాయతీ వికాస్ పురసారం’ కింద ఎంపికైన 36 గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులను కలెక్టర్ శివలింగయ్య, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పంచాయతీలు, సర్పంచుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరిగి, మరింత అభివృద్ధి జరగాలనే సంకల్పంతో ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామన్నారు.
పేదరికం లేని, ఆరోగ్యవంతమైన, చైల్డ్ ఫ్రెండ్లీ, నీరు సమృద్ధిగా ఉన్న, పచ్చదనం, పరిశుభ్రత కలిగిన, మౌలిక సదుపాయాలతో కూడిన స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, సుపరిపాలన ఉన్న, మహిళా స్నేహ పూర్వక వంటి మొత్తం తొమ్మిది అంశాల్లో ఒకో విభాగానికి 3 చొప్పున గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తూ నిధుల విడుదలలో కోతలు పెట్టి సవాలక్ష కొర్రీలు పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల విషయమై పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారిని రెండురోజుల క్రితం ఢిల్లీకి పంపించామని చెప్పారు. గ్రామ పంచాయతీకి కొత్త భవనాలను మంజూరు చేస్తున్నామని, జనగామ జిల్లాలో 100శాతం పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, ఇందుకోసం ప్రతి నెలా నిధులను ఇస్తున్నామని తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాలోని 54 గ్రామ పంచాయతీలకు అవార్డు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే తాటికొండ, జడ్పీ చైర్మన్లు సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య పాల్గొన్నారు.
ఖలీల్‌వాడీ, మార్చి 25 : రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందడంతోపాటు దాని పరిధిలోని ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే తెలంగాణ రాష్ర్టానికి జాతీయ అవార్డుల పంట పండుతున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో శనివారం జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా, జడ్పీచైర్మన్ విఠల్‌రావు, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు హాజరయ్యారు. ఎంపిక చేసిన తొమ్మిది అంశాల్లో ఉత్తమ జీపీలుగా ఎంపికైన గ్రామపంచాయతీల పాలకవర్గాలకు మంత్రి అవార్డులు అందజేశారు. 2021-22 సంసద్ ఆదర్శ గ్రామయోజన కింద కేంద్రం దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేయగా, అందులో తెలంగాణలోని 19 గ్రామాలు ఉత్తమ జీపీలుగా ఎంపికైనట్టు గుర్తుచేశారు. ఉత్తమ జిల్లాల కేటగిరిలో జగిత్యాల మొదటి స్థానం, నిజామాబాద్ మూడో స్థానాన్ని దక్కించుకొని అవార్డులు అందుకున్నాయని చెప్పారు. 2022లో సుజలాం కేటగిరి-1లో తెలంగాణకు మూడో ర్యాంకు వచ్చిందని, సుజలాం-2 కేటగిరిలో కూడా మరోమారు తెలంగాణ రాష్ట్రం ద్వితీయ ర్యాంకును దక్కించుకోవడం విశేషమన్నారు. ఇలా వరుస అవార్డులు రావడం ఏదో ఆషామాషీగా జరగడం లేదని, ప్రభుత్వం ముందుచూపుతో చేపడుతున్న నిర్దిష్ట కార్యక్రమాలతో, గ్రామాలను సుపరిపాలన దిశగా ముందువరుసలో నిలుపుతుండడంతో అవార్డుల పంట పండుతున్నదని స్పష్టం చేశారు. ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమష్టిగా పని చేస్తూ మరిన్ని అవార్డులు వచ్చేలా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి, మార్చి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు నిధుల వరద పారిస్తుండంతో మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం పెద్దపల్లి కలెక్టరేట్లో 27 పంచాయతీలకు జాతీయ అవార్డుల ప్రదానోత్సవాన్ని కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తమ పంచాయతీలుగా నిలిచిన 27 గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఎంపీవోలను సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్తరూపు సంతరించుకున్నాయని చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఉన్నారు.