హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తేతెలంగాణ): ఎస్సీ, ఎస్టీ కులాలకు బెస్ట్ అవైలబుల్ పథకం కింద రూ. 220కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలుగా వీటిని చెల్లించకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లపై నివేదిక ఇవ్వండి : జాతీయ ఎస్సీ కమిషన్
తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం నిలిచిపోవడంపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. జైభీమ్ యూత్ ఇండియా ప్రతినిధుల ఫిర్యాదుపై కమిషన్ చర్యలు చేపట్టింది. స్కీమ్ అమలు, స్కూళ్లకు 200 కోట్ల బకాయిలపై పూర్తి వివరాలను అందించాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించింది. వారంలోగా నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది.