నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు(Dalitha Bandhu) లబ్ధిదారుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. తాజాగా నల్లగొండ(Nalgonda) నియోజకవర్గంలో దళితబంధు పథకంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారికి ప్రభుత్వం నిధులు ఇవ్వాలని లబ్ధిదారులు నిరసనకు దిగారు. పలుమార్లు లబ్ధిదారులు కలెక్టర్‌కు, అధికారులకు తమ గోడును విన్నవించారు. అయినా స్పందన లేకపోవడంతో గురువారం మరోసారి ఆందోళనకు దిగారు.
నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో లబ్ధిదారులు అర్ధనగ్న(Half-naked) ప్రదర్శన చెప్పట్టారు. కొద్దిసేపు రోడ్‌పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు దళితబంధు డబ్బులు ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.