దేవరకొండ, అక్టోబర్ 10: కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలు నచ్చక తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ నేత కేతావత్ బీల్యానాయక్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బుధవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండలోని తన నివాసంలో బీల్యానాయక్ మీడియాతో మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానాలు నచ్చకనే పార్టీ మారుతున్నట్టు ఆయన చెప్పారు. దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు లేడని, పేదలకు న్యాయం జరగాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోనే సాధ్యమని నమ్ముతున్నానని పేర్కొన్నారు.