సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 10, 2020 , 01:56:17

ధూళిపూల సుగంధాలు

ధూళిపూల సుగంధాలు

  • కరోనా వచ్చినా వెరుపులేక పనిలోకి
  • రోడ్లు ఊడుస్తున్న తల్లిదండ్రులు
  • వారిని చూసి గర్విస్తున్న పిల్లలు 

మహానగర దేహాన్ని అందంగా తీర్చిదిద్దే చేతులవి.. మురుగు కాల్వల గుండె నాళాలు క్లాట్‌ కాకుండాచేసే స్టెంట్లు వాళ్లు.. దుమ్మును ముద్దాడే దేహాలు వారివి.. మోరీకి చేతులొగ్గే చెలిమి వారిది. మనం నిద్రలేవడానికి ముందే.. విధులను నిర్వర్తించే శ్రమజీవులు. మన ఆరోగ్యంకోసం అహరహం పరితపించే పారిశుద్ధ్య కార్మికులు. ప్రపంచాన్ని కరోనా కాటేస్తున్నా.. మన సమాజం దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకోవడానికి కృషిచేస్తున్న పరిశుద్ధ జీవులు వారు. ‘అందరి లెక్క ఇండ్లల్లో ఉండాలని మాకు మాత్రం ఉండదా? కానీ మేముచేసే పని మేమే చేయాలి. మా పని ఇంకొకరుచేయరు. ఇంకొకళ్ల పని మేం చేయలేం. ప్రజలకోసం పనిచేయాలె. సర్కార్‌ చెప్పినట్టు వినాలె. ఇన్నందుకు ఇనామ్‌ ఇచ్చిండు కేసీఆర్‌' అని తమ విద్యుక్తధర్మాన్ని విస్మరించకపోవడం వారికే సాధ్యమైంది. 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి - నమస్తే తెలంగాణ: హన్మకొండలోని సహకారనగర్‌.. మున్సిపల్‌ రిక్షా పుల్లర్‌ యాస బాబు.. ఓ పెద్దమనిషి ఖాళీజాగలో రేకులేసుకొని ఉంటున్నడు. బాబుకు ఇద్దరు పిల్లలు. కొడుకు నెల్సన్‌ రాజు గోవా ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నడు. కూతురు డయానా.. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి నీట్‌కు రెడీ అవుతున్నది. బాబు పెద్దగా చదువుకోలేదు. కానీ తన పిల్లలను మాత్రం బాగా చదివిస్తున్నాడు. తాను పనిచేస్తేనే పిల్లలను చదివించుకోగలడు. కరోనా వంటి విపత్తు రావడంతో తన విధులను మరింత నిబద్ధతతో చేస్తున్నాడు. ‘మాది రేగొండ (ప్రస్తుతం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా). నేను పదోతరగతి వరకు చదువుకున్న. 14 ఏండ్లుగా కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న. ఊర్లె ఇల్లులేదు. ఇక్కడా ఇల్లులేదు. ఓ పెద్ద మనిషి ఖాళీ జాగలో రేకులేసుకొని ఉంటున్న. నా అదృష్టం కొద్దీ పిల్లలు కష్టపడి చదువుకొంటున్నరు. కొడుక్కు ఐఐటీ గోవాలో సీటొచ్చినప్పుడు పైసల్లేకపోతే వినయన్న (ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌) యాభై వేలు ఇచ్చి ఆదుకొన్నడు. నా భార్య (లలిత) ఇండ్లండ్ల పనిచేస్తది. కరోనా అన్నప్పటి నుంచి ఇండ్లండ్ల పనికి రావద్దన్నరు. ఇంట్లనే ఉంటాంది. బయట మంచిగలేదు.. నన్ను నాలుగొద్దులు పని బంద్‌చేయమన్నరు ఇంట్ల. కానీ రెక్కాడితేనే డొక్కాడుతది కదా! పోకపోతే ఎట్ల? డాక్టర్లు, పోలీసోల్లు, మేము పనిచేయకపోతే ఎట్ల. ఎవల ఇండ్లండ్ల వాళ్లుంటే ఇంటి చెత్త రోడ్డుమీదికి రాకుండ ఉంటదా? ఎవల చెత్త వాళ్లు ఉంచుకోరు కదా! మోరీలు తీయాలె. రోడ్లను ఊడ్వాలె. మా పని మేమేచేయాలి. చేతులకు గ్లౌసులిచ్చిండ్లు. పనిచేసే దగ్గర శానిటైజర్లు పెట్టిండ్లు. ఇంటికొచ్చినంక కూడా కాళ్లురెక్కలు కడుక్కొని, తానం చేసినంకనే లోపలికి వస్తున్నం. ఎవలు పనిచేయకపోయినా అందరి కడుపును కేసీఆర్‌ సారు ఇసారిచ్చిండు. అందరికీ ఫ్రీగా బియ్యం ఇచ్చిండు. ఇసొంటి టైంల ఎవలు కడుపు ఇసారిస్తరు. కష్టకాలంలో ఆదుకున్న దేవుడు కేసీఆర్‌. దేవుడు మల్ల దేవుడసొంటి కేసీఆర్ని ఇచ్చిండు. ఎంతమంది ఏమనుకున్నా మంచిదే మాకైతే కేసీఆరే దేవుడు. చేసుకునోళ్లకు చేసుకున్నంత అన్నట్టే మా కష్టాన్ని కేసీఆర్‌ గుర్తించిండు. అందరి నౌకర్లు తక్కువచేసినా మాకు మాత్రం మొత్తం ఇస్తున్నడు. మేం చేసిన పనికి మెచ్చి ఐదువేల బోనస్‌ లెక్క ఇస్తాండు. ఈ కష్టకాలంలో సుత ఇట్లియ్యటం గొప్పే’ అని యాసబాబు ముఖ్యమంత్రిని కొనియాడారు.

గర్వంగా ఉన్నది 

మా నాన్న పారిశుద్ధ్య కార్మికుడు. ఆయన రోడ్లెక్కితేనే మా ఇల్లు గడుస్తుంది. ఆయన పెద్దగా చదువుకోకపోయినా మమ్మల్ని కష్టపడి చదివించాడు. ఆయన కష్టం వల్లే నేను ఐఐటీ గోవాలో చదువుతున్న. ఐఐటీలో చేరినప్పుడు సెల్ఫ్‌ ఇంట్రడక్షన్‌ ఇచ్చినప్పుడు ‘నేను మున్సిపల్‌ రిక్షాపుల్లర్‌ కొడుకును అని గర్వంగా చెప్పుకున్నా. మొన్న మాకు సెలవులు ఇచ్చారు. గోవా నుంచి మార్చి 5న ఇంటికొచ్చిన. అనుకోకుండా కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఎవరూ బయటికెళ్లొద్దని చెప్పారు. కరోనా ఎంత డేంజరసో తెలుసు. ఇంట్లోనే ఉండమని నాన్నకు చెప్పాలని అనుకున్న. కానీ ఆయన పని నేను చేయలేను. ఆయనే చేయాలి. సరిహద్దుల్లో సైనికుల లెక్క పరిసరాల సైనికుడిగా మా నాన్న. ఆయన లాంటి వాళ్లు కొన్ని వేలమంది పనిచేస్తున్నరు. బోర్డర్‌లో సైనికుడిని వద్దు అనలేం. నాన్నను కూడా వద్దనలేకపోయా. నేను గోవా ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ అయినా సరే ‘నేనొక పారిశుద్ధ్య కార్మికుడి కొడుకును అని గర్వంగా చెప్పుకుంటా. 

- నెల్సన్‌రాజ్‌, యాసబాబు కొడుకు

పారిశుద్ధ్య సైనికుల ఇల్లు

హన్మకొండలోని ఇందిరానగర్‌. వరంగల్‌ కార్పొరేషన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల ఇల్లది. అంకేశ్వరపు ఎల్లస్వామి పద్మావతి దంపతులు. ఆయన జవాన్‌. ఆమె పారిశుద్ధ్య కార్మికురాలు. వీరికి ఒక బిడ్డ. ఇద్దరు కొడుకులు. బిడ్డ కృష్ణార్చన. ఎంసీఏ పూర్తిచేసింది. ఈ మధ్యే పెండ్లయింది. బ్యాంక్‌ ఉద్యోగాల పరీక్షలకు సన్నద్ధమవుతున్నది. పెద్ద కొడుకు భరత్‌రాజ్‌. ఎంబీఏ పూర్తిచేసి పోటీపరీక్షలకు రెడీ అవుతున్నాడు. చిన్నకొడుకు భాగ్యరాజ్‌కు ఇటీవలే ఎస్సై ఉద్యోగం వచ్చింది. శిక్షణలో ఉన్నాడు. భాగ్యరాజ్‌కు అటవీశాఖలో బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం వచ్చిం ది. రైల్వేలో అసిస్టెంట్‌ లోకోపైలట్‌ ఉద్యోగం, గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌గా, పోలీస్‌ కానిస్టేబుల్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇవేవీకాదని ఎస్సై ఉద్యోగానికి వెళ్లాడు. 

అమ్మానాన్నల ముఖాలు చూడటం ఎరుగం 

అందరి పిల్లల్లా మాకు పొద్దున్నే తల్లిదండ్రుల ముఖాలు చూసే అదృష్టం లేదు. మేము లేచేసరికే వాళ్లు రోడ్లెక్కుతారు. మళ్లీ మేము ఇం టికి వచ్చేసరికి సాయం త్రం డ్యూటీలకు వెళతారు. అక్కను తమ్ముడిని నన్నూ చదివించారు. మా ఎదుగుదలకు, ఉన్నత చదువులకు బాటలు వేసింది ఈ పారిశుద్ధ్య పనే. మా తల్లిదండ్రుల పని మాకు దైవంతో సమానం. అక్క పెండ్లయింది. తమ్ముడికి ఎస్సైగా ఉద్యోగం వచ్చింది కదా! నేను  ఏదైనా ఉ ద్యోగం సాధిస్తా. అందుకే పని మానేయి అమ్మా! అంటే అక్కకు, నీకూ ఉద్యోగం రావాలె. మన కష్టం ఫలించేదాకా పనిచేయడం ఆగదని అమ్మ చెప్పినప్పుడు ఆమెలోని పనిసంస్కృతి, ఆమె పనికిచ్చే గౌరవం అర్థమైంది. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలుగా మేం అందరికీ పరిచయం చేసుకుంటాం. గర్వంగా ఫీల్‌ అవుతాం. 

- భరత్‌రాజ్‌, ఎల్లస్వామి కొడుకు

మా ప్రాణాలు అడ్డేస్తం 

కేసీఆర్‌ ప్రాణాలకు తెగించి కొట్లాడి రాష్ర్టాన్ని తెచ్చినట్టే.. మేము ప్రజల ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేసి పనిచేస్తున్నం.  సైనికులు సరిహద్దున నిలబడి దేశాన్ని రక్షిస్తుంటే మేము ప్రజలకు రోగాలు రాకుండా ప్రాణా లు పణంగా పెట్టి శుభ్రంచేస్తున్నం. పోవద్దు అంటే కుదురుతుందా? ఎవల పనివాళ్లు చేయాలె. ప్రజలు  రోగాలపాలు కాకుండా కాపాడాలంటే ఊరును శుభ్రంగా ఉంచాలె. అది చేసేది మేమే. మేమే ఇంట్ల ఉంటే మరెవ్వరు చేయాలె. అందుకే మా పని మేమే చేస్తాం. మమ్ములను ఆదుకునేందుకు అక్కడ కేసీఆర్‌ ఉన్నడు. ఇక్కడ మాకు వినయన్న (ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌) ఉన్నడు. మంత్రులున్నరు. మా ఆఫీసర్లున్నరు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తానం. ఈ మురికి కష్టంతోనే పిల్లల్ని చదివించిన. బుద్ధిమంతులైండ్లు. అదే సంతోషం. 

-అంకేశ్వరపు ఎల్లస్వామి, కార్పొరేషన్‌ జవాన్‌

కాలు రెక్కలే ఆస్తులు 

మున్సిపాలిటీలో ఆయన జవాన్‌గా నేను వర్కర్‌గా ఇద్దరం ఒక్కసారే చేరినం.  ఇరవై ఏండ్లుగా ఈ పనిచేస్తున్నం. నాగలేకుంట పనిచేస్తం. కాలురెక్కలే ఆస్తిపాస్తులు. బయట కరోనా ఉన్నది. పోవద్దు అని అందరూ తలోమాట అంటున్నరు. కరోనా రాకుంట ప్రజల్ని కాపాడాలంటే మా వంతుగా మేము సూత సాయం సేయాలె. ఇంట్ల కూసోని ఉంటే ఊరెవలు సాఫ్‌ సేయాలె. ఒకనాడు కాకపోతే ఒకనాడన్న అందరి కష్టం ఫలితమియ్యదా? కరోనా పోయినంక కష్టపడ్డోళ్లకు సర్కార్‌ కనిపెట్టుకొని సూడదా? నా కొడుకు చెప్పిండు. అమ్మా కేసీఆర్‌ మీరు బాగా పనిచేసినందుకు కేసీఆర్‌ గిఫ్ట్‌ కింద ఐదు వేలు ఇస్తండట (మొహంలో నవ్వు) అని. 

-అంకేశ్వరపు పద్మావతి, పారిశుద్ధ్య కార్మికురాలు


logo