జగిత్యాల: ఆపద అంటూ డయల్ 100కు అర్ధరాత్రి వేళ ఫోన్ వచ్చింది. ఏముందిలే అని తేలికగా తీసుకోకుండా వెంటనే స్పందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి ఓ ప్రాణాన్ని కాపాడారు. నిర్మల్ జిల్లాకు చెందిన గణపతి.. జగిత్యాల (Jagtial) జిల్లాలోని బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రోల్ల వాగు దగ్గర పీతలు పట్టడానికి వచ్చాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో పాముకాటుకు గురయ్యాడు. దీంతో డయాల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించాడు.
ఆ సమయంలో బీర్పూర్ పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న ప్రొబేషనరీ ఎస్ఐ రాజు వెంటనే స్పందించారు. సిబ్బందితో కలిసి అడవీ ప్రాంతానికి వెళ్లారు. పాముకాటు గురైన వ్యక్తిని సురక్షితంగా 108 అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దీంతో గణపతి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, ఆపద సమయంలో వెంటనే స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు ప్రొబేషనరీ ఎస్ఐ రాజు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.