సీఎం రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రేపు కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని
.. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని తెలిపారు. ఈ శంకుస్థాపన వేదికకు కొద్దిదూరంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శన మాత్రం సీఎం షెడ్యూల్లో లేకపోవడం శోచనీయమని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డికి ఎందుకింద నిర్లక్ష్యమో అర్థం కావడం లేదని అన్నారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటూ ఈ జిల్లాకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి కొల్లాపూర్ పర్యటనలోనే చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీరం హర్షం వర్దన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నార్లాపూర్ పంప్‌హౌజ్‌కు నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అని కొనియాడారు. మిగతా పనులు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. జూరాల నుంచి నీళ్లు కిందకు వెళ్తున్నా.. నెల రోజులగా కాల్వలకు నీళ్లను వదలడం లేదని అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తే కల్వకుర్తి లిఫ్ట్ లను ఆన్ చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ కొల్లాపూర్‌కు మామిడి మార్కెట్‌ను కేటాయించారని బీరం హర్షవర్దన్ రెడ్డి తెలిపారు. ఆ మార్కెట్‌కు నిధులు కేటాయించి, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కొల్లాపూర్‌కు కేటాయించిన హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని వేరే ప్లేస్‌కు మార్చారని.. తక్షణమే దాన్ని తిరిగి కొల్లాపూర్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను ఆపేశారని.. వెంటనే ఆ నిధులను కేటాయించి, పనులు కొనసాగించాలన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలో కొన్ని లిఫ్ట్ పథకాలు మంజూరయ్యాయని, వాటికి నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు.
రాజకీయ కక్షలను నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పెంచి పోషిస్తున్నారని బీరం హర్షవర్దన్ రెడ్డి ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి హత్య జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎక్కువయ్యాయని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జర్నలిస్టులు తమ సమస్యలపై రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని, ప్రభుత్వ పెద్దలు గానీ, కాంగ్రెస్ నేతలు కానీ వీటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.