హైదరాబాద్, మార్చి 25 (నమస్తేతెలంగాణ) : తేనెటీగల పెంపకం వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఎదిగితే రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య పేర్కొన్నారు. మంగళవారం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలోని ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధన స్థానం నిర్వహణలో తేనెటీగల పెంపకం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించగా భూత్పూర్, పెద్దమందడి, కొత్తకోట మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన 30 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పిడిగం సైదయ్య మాట్లాడుతూ.. దేశంలో లభించే తేనే అత్యంత శ్రేష్ఠమైనదని, పోషక విలువలతోపాటు ఔషధ గుణాలు ఉండటం వల్ల ఎగుమతికి ఎకువ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. శాస్త్రవేత్త నిఖిల్, ప్రధాన శిక్షకుడు, అసోసియేట్ ప్రొఫెసర్ షహనాజ్ మాట్లాడుతూ… ఆరు రోజుల శిక్షణలో తేనెటీగల జాతులు, పెంపకం, తేనె తీసే విధానం, తేనెటీగల పెంపకం ద్వారా లభ్యమయ్యే ఉత్పత్తులు, మారెటింగ్ మెళకువల గురించి శిక్షణ ఇస్తామని తెలిపారు.