ఖైరతాబాద్, సెప్టెంబర్ 20 : మెగా డీఎస్సీ పేరుతో బీఈడీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం విమర్శించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీఈడీ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు భూక్యా కుమార్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే 25వేల పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, తీరా అధికారం చేపట్టాక విస్మరించిందని మండిపడ్డారు. కేరళ ప్రభుత్వం 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేసిందని, తెలంగాణలో సైతం అదే విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు. జీవో-108ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. 26వేలకు పైగా పోస్టులకు పదోన్నతులు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం తద్వారా ఏర్పడిన ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. 9వేల స్కూల్ అసిస్టెంట్, 20 వేల ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5వేలు, 6వేలు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. బీహార్‌లో రూ. వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తున్నారని, కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో పెట్టిన భృతి ఏం చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రితోపాటు ఐదు పోస్టులు తన వద్దే పెట్టుకున్నారని, ఆ శాఖలపై కనీసం ఆయనకు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో ఉన్న వాటిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యావ్యస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.