KCR : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో.. తెలంగాణకు పరిశ్రమలు తరలివస్తున్నయ్ అనే పరిస్థితి నుంచి తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నయ్ అనే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలకుల చేతగాని తనంతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యిందని మండిపడ్డారు. కరెంటు కోతలతో పారిశ్రామిక వర్గమేగాక కార్మిక వర్గం కూడా నిస్తేజానికి గురయ్యిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తుందని వ్యాఖ్యనించారు.
‘పరిశ్రమలు తెలంగాణకు తరలివస్తున్నయ్ అనే పరిస్థితి నుంచి పరిశ్రమలు తెలంగాణ నుంచి తరలిపోతున్నయ్ అనే పరిస్థితులు వచ్చినయ్. కార్నింగ్ అనే ఇండస్ట్రీ రూ.1000 కోట్ల పెట్టుబడులతో వచ్చింది. ఇగ పనులు ప్రారంభిస్తరు అనుకుంటుండగానే వెనక్కు తగ్గిండ్రు. ఇక్కడి పరిస్థితులు తారుమారుగా ఉన్నయని గమనించి తమిళనాడుకు తరలిపోయిండ్రు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత రివర్స్ అయిందో తెలుస్తున్నది’ అని కేసీఆర్ అన్నారు.
‘రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమ తరలిపోవడం అనేది బాధాకరం. పారిశ్రామిక వర్గాలే కాకుండా పరిశ్రమల్లో పనిచేసే కార్మిక వర్గం కూడా ఈ ప్రభుత్వం తీరువల్ల నిస్తేజానికి గురయ్యింది. బీఆర్ఎస్ హయాంలో తాము మూడు షిఫ్టుల్లో పనిచేసుకునే వాళ్లమని, ఇప్పుడు అది గూడా లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన చెందుతున్నరు. వాళ్ల ఆగ్రహాన్ని కాంగ్రెస్ సర్కారు ఎదుర్కోబోతున్నది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినే పరిస్థితి ఉంది’ అని ఆయన చెప్పారు.