హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): వరస సెలవులు ఉండటం వల్ల ప్రయాణాలు చేసేముందు యాత్రికులు, పర్యాటకులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం, పోలీసులు హెచ్చరించారు. ట్రావెల్ ప్యాకేజీ బుక్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విమాన, హోటల్, రవాణా ప్యాకేజీలు ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆకర్షణీయమైన ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు, సోషల్‌మీడియాల్లో ప్రలోభపెట్టి.. ఆఖరికి అందినంత లాగేస్తారని, అనుమానాస్పద లింకులు, ప్రకటనలు క్లిక్ చేసి, మోసపోవద్దని సూచించారు.
క్యూఆర్ కోడ్‌తో రైల్వే టికెట్
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): టికెట్ జారీ కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నది. రైల్వే టికెట్ జారీ కోసం ఎస్సీఆర్ ఆధ్వర్యంలో అన్ని రైల్వేస్టేషన్లలో క్యూఆర్ కోడ్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. నగదు రహిత లావాదేవీలను తగ్గించి, డిజిటల్ చెల్లింపులు పెంచడానికి వీలుగా ఈ విధానాన్ని తీసుకువచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.
శ్రీశైలం జలాశయంలో చేపలవేటపై ఆంక్షలు
హైదరాబాద్, ఆగస్టు (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం జలాశయ పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జూలై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి సమయమని, ఈ సమయంలో శ్రీశైలం జలాశయం, బ్యాక్ వాటర్స్‌లో చేపల వేట వద్దని ఆదేశించింది.
ఆరుగురు ఎస్పీలకు పదోన్నతి
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ఆరుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులను జారీచేసింది. సీనియార్టీ ప్రకారం 8 మంది జాబితాను సిద్ధం చేసి పంపగా వై సాయిశేఖర్, సమయ్ జాన్రావుకు కొన్ని అభ్యంతరాలతో ఇవ్వలేదు. మిగతా వారైన బీ రామ్‌రెడ్డి, సీహెచ్ శ్రీధర్, ఎస్ చైతన్యకుమార్, ఏ భాస్కర్, కే నరసింహ, కే శిల్పవల్లికి ఐపీఎస్ హోదా ఇచ్చింది.