హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలకు దోమలు కారణమవుతాయని.. ఇండ్ల తలుపులు, కిటికీలకు దోమతెరలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు.
కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని ఆయన కోరారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని తినొద్దని పేర్కొన్నారు. గాలి ద్వారా వ్యాప్తిచెందే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందాలని.. తుమ్మినప్పుడు చేతిరుమాలు ఉపయోగించాలని కోరారు. ఎవరికైనా విపరీతమైన జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, బాడీపెయిన్స్ ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని ఆయన సూచించారు.