హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘మా వాటా మాకు కావాలి- మా అధికారం మాకు కావాలి’ అనే నినాదంతో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 24న బీసీల మహాధర్నా నిర్వహించనున్నారు. సమితి నేతలు, ఏఐబీసీఎఫ్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ విశారదన్ మహారాజు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్కుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని, 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. 24న నిర్వహించే మహాధర్నాకు బీసీలు కదలిరావాలని పిలుపునిచ్చారు. ధర్నాకు తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం, కొండా లక్ష్మణ్ బాఫూజీ గ్లోబల్ ఫెడరేషన్, నేషనల్ ఓబీసీ మోర్చా, బీసీ కులాల సమన్వయ వేదిక, మన ఆలోచన సాధన సమితి, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం, దేవాంగ సంఘం, బీసీ ఫెడరేషన్, బీసీ పొలిటికల్ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, నిరుద్యోగ హక్కుల వేదిక తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి.