హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘బీసీ బంద్‌తో మొదలైన ఈ పోరు ఆరంభం మాత్రమే.. 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించేదాకా భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. భూకంపం సృష్టించైనా రిజర్వేషన్లను సాధించుకుంటాం’ అని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యా దవ్ స్పష్టంచేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం కోటా ఇవ్వకుండా ధోకా చేసిన కాంగ్రెస్‌ను బీసీ సమాజం బొందపెట్టడం ఖాయం అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీ ధర్నా నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరక ముందు ఇతర బీసీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, బీసీ బిల్లులను ఆమోదించకుండా ద్రోహం చేసిన కాంగ్రెస్, బీజేపీ బీసీ బంద్‌లో పాల్గొనడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. దొంగే దొంగా.. దొంగా.. అన్న చందంగా రెండు జాతీయ పార్టీలు బలహీనవర్గాలను వంచిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోసం చేస్తున్నదని మండిపడ్డారు. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీ బిల్లును ఆమోదించాలని ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాల్సిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా పేరిట నాటకాలాడారని విమర్శించారు. మళ్లీ తెలంగాణకొచ్చి చెల్లని జీవో ఇచ్చి.. దగా చేశారని తూర్పారబట్టారు. కోర్టులో కొట్టుడుపోతుందని తెలిసినా నమ్మించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. 42 శాతం బీసీ కోటా ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించలేకపోతే తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. బీసీ బిల్లులకు చట్టబద్ధత కల్పించండంలో ఆ రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయయని, అవే పార్టీలు నేడు బీసీ బంద్‌లో పాల్గొనడం సిగ్గుచేటని విమర్శించారు. మోసంచేసిన ఆ పార్టీలే బీసీ ఉద్యమానికి మద్దతిస్తున్నామని డ్రామాలు ఆడుతుంటే.. బంద్ ఎవరికి వ్యతిరేకమో అర్థంకావడం లేదని చెప్పారు. రెండు జాతీయ పార్టీల వైఖరిని బీసీ సమాజం గమనిస్తున్నదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ కడదాకా నిలుస్తుందని తేల్చి చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లకు ఒక్క శాతం తక్కువైనా జరగబోయే పరిణామాలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పచ్చి బూటకమని, 42 శాతం కోటాపై హైకోర్టు విధించిన స్టేతోనే ఈ విషయం తేటతెల్లమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధిలేని హస్తం పార్టీ పూటకో నాటకమాడుతూ బీసీ సమాజానికి ద్రోహం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. చెల్లని జీవోలు, ఆర్డినెన్స్‌లు ఇచ్చి నమ్మించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని విమర్శించారు. విద్యా, ఉద్యోగాలు, కాం ట్రాక్టులు, వైన్‌షాపుల కేటాయింపుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. ఇప్పటికైనా బీసీ కోటాపై చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీ వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.