హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): బీసీల బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి.. రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరుతూ 2న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన బీసీల పోరుగర్జన సభకు అఖిలపక్ష నేతలు తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు అఖిలపక్షం నేతలను ఆదివారం ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని కలిసి బీసీల పోరుగర్జనకు హాజరు కావాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
పండుగపూట బీఆర్ఎస్ నేత అరెస్ట్
సిరిసిల్ల రూరల్, మార్చి 30: వాట్సాప్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టాడంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ దళిత నాయకుడు బొడ్డు శ్రీధర్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శ్రీధర్ ఫోన్ సీజ్ చేసినట్టు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.