వరంగల్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ సర్కార్‌పై బీసీలు తిరుగుబాటు జెండాఎత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీపై ఇచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు తమకు తీరని ద్రోహానికి పాల్పడిందని ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీపై రగిలిపోతున్నారు. ఇందుకు పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలిచాయి. రెండు, తుది విడతతోపాటు రానున్న ఏ ఎన్నికలైనా రేవంత్ సర్కార్ మోసానికి గుణపాఠం తప్పదని బీసీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అదే సమయంలో పదేండ్ల కేసీఆర్ పాలనలో బీసీల అభ్యున్నతికి విజయవంతంగా అమలైన పథకాలు, దక్కిన రాజకీయ అవకాశాలు ఈ సందర్భంగా పల్లెల్లో చర్చనీయాంశాలు అయ్యాయి.
ఫలితంగానే తెలంగాణ పల్లెజనం బీఆర్ఎస్ మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా చేసిన మోసాలను బీసీలు గుర్తించారనే విషయం ఈ ఫలితాలతోనే తేటతెల్లమైందిన ఓ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం నేత విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల అనంతరం బీసీ కులగణన, దేశ చరిత్రలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనని ఊదరగొట్టి, చివరికి చెల్లని బిల్లును తెచ్చిందని, ఆర్డినెన్స్‌తో కాలయాపన చేసిందని గ్రహించారని తేల్చి చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి, తీరా పంచాయతీల రిజర్వేషన్ల విధి విధానాల పేరుతో జారీ అయిన 46వ జీవోలో బీసీలకు అసలు ఎంత శాతం ఇవ్వాలి? అన్నది తేల్చనప్పుడే తమకు కాంగ్రెస్ మోసం, ద్రోహం చేసిందని బీసీలు గుర్తించారన్నారు.
42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కనీసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకుండా కేవలం 17 శాతానికే బీసీలను పరిమితం చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై బీసీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వేషన్ మోసానికి సాయి ఈశ్వరాచారి అనే యువకుడు ఆత్మార్పణ చేసుకున్నాడనే ఆగ్రహంతో బీసీలు కాంగ్రెస్ పార్టీపై రగిలి పోతున్నారని తెలిపారు. దీని పర్యవసానం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు బీసీలు తగిన బుద్ధి చెప్తారని మరో బీసీ నేత హెచ్చరించారు.
బీసీలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ మొదటి నుంచీ చిత్తశుద్ధిని చాటుకుంటూనే ఉన్నది. తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్‌గా మధుసూదనాచారికి అవకాశం కల్పించింది. ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి కొనసాగుతున్నారు. ప్రస్తుత శాసనమండలి వైస్ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ముదిరాజ్ ఉన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో, ఆలయ కమిటీల్లోనే కాకుండా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల సారథులు, సభ్యుల్లో సింహభాగం బీసీలకు కేటాయించింది బీఆర్ఎస్ పార్టీయేననేది నిర్వివాదాంశమని బహుజన వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.
పదేండ్ల కేసీఆర్ పాలనలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీలకు అనేక రాజకీయ అవకాశాలు ఇచ్చారని బీసీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ప్రభుత్వపరంగా కేసీఆర్ బీసీ వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారని బలంగా నమ్ముతున్నారు. ఉమ్మడి పాలనలో కునారిల్లిన కులవృత్తులకు జవసత్వాలు అందివ్వడం ద్వారానే రాష్ట్రం పురోగమిస్తుందని కేసీఆర్ తన పదేండ్ల పాలనలో నిరూపించారు. అందులో భాగంగానే ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అనేక విప్లవాత్మక పథకాలను విజయవంతంగా అమలు చేశారు.
గొర్రెల పంపిణీ, ఉచిత చేపపిల్లల పంపిణీ వంటి పథకాలతోపాటు చేనేత, కల్లుగీత సహా వృత్తిపనివారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం, గౌడన్నల కోసం నీరా పాలసీ, ఉమ్మడి రాష్ట్రంలో నిషేధానికి గురైన కల్లుదుకాణాల పునరుద్ధరణ, రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర్తింపు వంటి వాటితోపాటు ‘బీసీ ఆత్మగౌరవ’ భవనాల నిర్మాణం వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని బహుజన వర్గాలు కీర్తిస్తున్నాయి. ‘బహుజన హితాయ.. బహుజన సుఖాయ’ అన్న అంతస్సూత్రాన్ని కేసీఆర్ ఆచరించి చూపారనే అభిప్రాయం స్థిరపడింది.