హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ )/మెహిదీపట్నం: ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఇప్పటివరకు కంటోన్మెంట్‌తోపాటు నగరవ్యాప్తంగా 650 కేంద్రాలను ఏర్పాటు చేసి 9.92 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు సమర్థంగా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. దరఖాస్తులను ఉచితంగానే అందిస్తున్నామని, ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జోనల్ కమిషనర్ వెంకటేశ్ దొత్రే తదితరులు పాల్గొన్నారు.