ఖైరతాబాద్, అక్టోబర్ 17: భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ బీసీ కుల గణనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు బీసీ లెక్కల మీద లేఖ రాయకుండా, కనీసం పార్లమెంట్ బయటా, లోపల మాట్లాడని ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ బీసీ జనగణనపై నాటాకాలడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రతి కిలోమీటరుకు అడ్డుకుంటామని హెచ్చరించారు. 48 గంటల్లో సమాధానం చెప్పాలని, లేని పక్షంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే శ్యామ్ కురుమ, మహిళా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మాదేశి రాజేందర్, మహేశ్ యాదవ్, ఎస్. శ్యామల, మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.