BC Reservations | హైదరాబాద్ : హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. హైకోర్టులో తమకు అన్యాయం జరిగిందంటూ బీసీ నేతలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ.. నాలుగు వారాల స్టే అంటే మాకు అన్యాయం జరిగినట్లే.. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. జ్యుడిషీయరి వ్యవస్థ మీద నమ్మకం పోయిందన్నారు. ఇంకెన్నాళ్లు తాము అన్యాయానికి గురి కావాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. జీవో అమలును నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు కోర్టు వాయిదా వేసింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే విధించి షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై రెండు రోజుల పాటు హైకోర్టులో సుధీర్ఘ విచారణ కొనసాగిన సంగతి తెలిసిందే.