హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు హైకోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్.. బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నారు..’ అంటూ బీసీ సంఘాలు నేతలు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, బీసీలకు పదవులు వస్తుంటే అగ్రకులస్తులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవులు మొత్తం అగ్రవర్ణాలకే, కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవులైనా బీసీలకు దకొద్దా..? అని ప్రభుత్వాన్ని బీసీ నేతలు నిలదీశారు.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రంలోగా స్పందించక పోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ‘బీసీల్లో ఎంతో చైతన్యం వచ్చింది.. ఊరురా స్పందన తెలుపుతాం. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. సాయంత్రంలోగా ప్రకటించాలి. లేదంటే పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తాం. దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుంది. ఏం తమాషాగా ఉందా..? బీసీలంటే అంత చులకనగా ఉందా..? ముఖ్యమంత్రి పదవులు రావు మంత్రి పదవులు రావు.. లేక లేక సర్పంచ్ అవకాశం వస్తే వాటిని కూడా లాగేసుకోవడం సరికాదు. ఈ సమాజంలో బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. స్టే విధించడం చాలా దురదృష్టకరం. రేపట్నుంచి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తాం’ అని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైకోర్టు వద్ద ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను రెండు వారాలపాటు ఆపడమనేది దురదృష్టకరమని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హకులకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి నుంచి విచారణ జరిపిన కోర్టు.. మరో రెండు రోజులు సమయం తీసుకొని ఇంకా విస్తృతంగా విచారణ చేపట్టాల్సి ఉండే. ఎందుకు ఆదరబాదరగా స్టే విధించాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని ఆర్కృష్ణయ్య హెచ్చరించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి రాజకీయ పార్టీలకు లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఆరోపించారు. అగ్రవర్ణాల నాయకులు 50 శాతం పేరుతో కృత్రిమ గోడలు సృష్టిస్తున్నారని చెప్పారు. గురువారం హైకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీసీలు సామాజిక న్యాయం పొందాలంటే ఎంత కష్టమో హైకోర్టు ఇచ్చిన స్టేనే ఉదాహరణ అని అన్నారు. పది శాతం ఉన్న ఓసీలకు 35 శాతం ఓపెన్ పెట్టినా కూడా వారు బీసీల రిజర్వేషన్లు ఇప్పుడు అడ్డుకున్నారని విమర్శించారు. మొదటి నుంచి కూడా రెడ్డీలు బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటూ వస్తున్నారని ఆయన ఆక్షేపించారు. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఆందోళన బాట పట్టాలని, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదింపజేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్లో ఎందుకు మాట్లాడటం లేదని, కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్మై బీసీలకు రిజర్వేషన్ ఇవ్వొద్దనే ఏమైనా నిర్ణయించుకున్నారా? అని నిలదీశారు. బీసీలు ఇప్పటికైనా కండ్లు తెరవండని, 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని వెనక్కి తీసుకుంటే తెలంగాణ సమాజం ఎలా భగ్గుమన్నదో, అదే తరహాలో బీసీ ఉద్యమం ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీలంతా శుక్రవారం బంద్ పాటించాలని పలు బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కులనిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు, సామాజిక తెలంగాణ మహాసభ అధ్యక్షుడు కొంకల వెంకటనారాయణ, ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. పాలకుల బీసీ వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకుండా జీవో 9ని ఇచ్చి మా పని అయిపోయిందని భావించటం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. పలు రాష్ట్రాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు ఎట్లాగూ సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేసిందని విమర్శించారు.ఆ డిక్లరేషన్ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బీసీలను మరోసారి మోసగించేందుకు ఉపయోగపడిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 9 బీసీలకు న్యాయం చేయలేక పోయినందుకు బీసీలకు ఇది చీకటి రోజుగా చరిత్రలో మిగిలిపోతుందని గురువారం ఒక ప్రకటనలో పేరొన్నారు. సమ వాటా సమన్యాయం, ఆత్మగౌరవం ప్రతి బీసీ స్వప్నమని అదే నినాదంతో హకుల సాధన కోసం బీసీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు.