హైదరాబాద్, మార్చి29 (నమస్తే తెలంగాణ): 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులను తక్షణమే అమలులోకి తేవాలని, బీసీలపై కాంగ్రెస్ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ స్పీకర్, బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంటర్ కోర్టు హోటల్లో బీసీ జనసభ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ సర్కారు తూతూమంత్రంగా కులగణన నిర్వహించిందని, 42శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలని ఇప్పుడు మరో నాటకానికి తెరతీసిందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే బీసీ, కుల సంఘాలు పార్టీలకతీతంగా ఒక తాటిపైకి రావాలని మధుసూదనాచారి పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జెండాలు, అజెండాలను పకనపెట్టి పోరాడాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ చెప్పారు. తక్షణం 42శాతం రిజర్వేషన్ల బీసీ బిల్లులను గవర్నర్ చేత ఆమోదింపజేయాలని రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సీనియర్ జర్నలిస్టు రమణకుమార్, బీసీ జర్నలిస్టుల ఫోరం నాయకుడు మేకల కృష్ణ, బీసీ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లోడంగి గోవర్ధన్‌యాదవ్, ఎంబీసీ కులాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, బీసీ సంఘాల నాయకులు దాసు సురేశ్, గుజ్జ కృష్ణ, గుజ్జ స త్యం, లాల్ కృష్ణ, గోరిగ మల్లేశ్‌యాదవ్, అనంతుల రామ్మూర్తిగౌడ్, రామకోటి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.