హైదరాబాద్, నవంబర్15 (నమస్తే తెలంగాణ): రుణాల మంజూరు లేదు.. ఉపాధి అవకాశాల జాడేలేదు.. నైపుణ్య శిక్షణలకు నిధులే లేవు.. టోటల్‌గా కార్పొరేషన్లు నిర్వీర్యమయ్యాయి. కొత్త పథకాల సంగతి దేవుడెరుగు.. పాత పథకాల అమలుకూ గడ్డుకాలం దాపురించింది. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లుగా నెలకొన్న దుస్థితి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు, చేవేళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గుప్పించింది. అదే పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఆ హామీల అమలుపై ఇప్పుడు కాడెత్తేసింది.
హామీల సంగతి అటుంచితే గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకూ గడ్డకాలం దాపురించింది. ఆయా పథకాలకు సర్కారు నిధులివ్వకపోవడంతో సంక్షేమ శాఖలు నిర్వీర్యమవుతున్నాయి. మొత్తంగా ప్రజాసంక్షేమం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. సంక్షేమ పథకాల అమలులో సర్కారు నిర్లక్ష్యపు వైఖరిపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నాయి.
కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తానని ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఉన్న కార్పొరేషన్ల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. రాజీవ్ యువవికాసం పథకం పేరుతో ఆ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. గత ఎన్నికల ముందు అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి యువతకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా వడ్డీలేని రుణాలను అందిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఎస్సీల్లో మాల, మాదిగలతోపాటు మిగతా 57 షెడ్యూల్డ్ కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏటా రూ.750 కోట్లు కేటాయిస్తామని ఘనంగా ప్రకటించింది. ఎస్టీలకు సంత్ సేవాలాల్ లంబాడ కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్, తుకారం ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలనూ జారీచేసింది.
ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన తరగతులు) సంబంధించి ఆర్యవైశ్య, రెడ్డి, ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడీ, ఏకలవ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను సైతం జారీచేసింది. ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ కార్పొరేషన్‌గా వేరు చేయాలని ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. 57 షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఏర్పాటుపై ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటుచేసిన 8 బీసీ కులాలైన రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర) వాల్మీక బోయ, కృష్ణ బలిజ, భట్రాజ్, కుమ్మరి ఫెడరేషన్లను సైతం కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించింది. అయితే వాటి ఏర్పాటు కోసం కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. కొన్ని కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది తప్ప చైర్మన్లను కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నియమించలేదు.
గడచిన 22 నెలల పాలనా కాలంలో కార్పొరేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రాజీవ్ యువ వికాసం పథకం పేరిట ఆయా సామాజిక వర్గాలకు మరో నమ్మకద్రోహాన్ని తలపెట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సబ్సిడీ రుణాలను ఇస్తామని ప్రగల్భాలు పలుకుతూ అందుకు విధంగా రుణమొత్తాన్ని భారీగా కుదించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్ర విద్రోహాన్ని తలపెట్టింది. ఉదాహరణకు ఎస్టీలకు సంబంధించి ట్రైకార్ సంస్థ రుణాలను దశాబ్దాలుగా అందిస్తూ వస్తున్నది. ఆ సంస్థ అందించే సబ్సిడీ రుణం యూనిట్ విలువ రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉండేది. ఎస్సీ కార్పొరేషన్ కూడా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాన్ని అందించేది. బీసీ కార్పొరేషన్ గరిష్ఠంగా 5 లక్షలు, అంతకు మించి కూడా సబ్సిడీ రుణం అందించే వెసులుబాటు ఉండేది.
కానీ, ప్రస్తుత పథకం ద్వారా గరిష్ఠంగా అందించే సబ్సిడీ రుణం రూ.4 లక్షలే. అందులోనూ ప్రభుత్వం లబ్ధిదారుడికి అందించేందుకు రూ.2.80 లక్షలే. మిగతా రూ.1.20 లక్షలను బ్యాంకు రుణంగానే ఇవ్వనుండటం గమనార్హం. దీంతోపాటు గతంలో ఆయా శాఖల్లో రుణ దరఖాస్తుదారు గరిష్ఠ వయోపరిమితి 50 ఏండ్లు ఉండగా, దానిని యువవికాసం పథకంలో 60 ఏండ్లకు పెంచడం కూడా అసలు లక్ష్యాన్ని నిరుగార్చే పనిచేసింది. దీంతో ప్రభుత్వం అటు కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడంతోపాటు, ఇటు యువతకు సైతం నమ్మకద్రోహం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్ యువవికాసం పథకం కింద దరఖాస్తులను స్వీకరించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వాటికీ అతీగతి లేకుండా పోయింది.