హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, ఆ మేరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి చట్టం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డి మాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కమిషన్ కూడా ఏర్పాటుచేసిందని, మరోవైపు ఇంటింటి సర్వే నిర్వహించిందని వెల్లడించారు. ఆ దిశలోనే చట్టం చేయాలని, రిజర్వేషన్లను పెంచాలని, ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఆర్ కృష్ణయ్యకు బీసీటీఏ వినతి…
బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంట్లో లేవనెత్తాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యకు బీసీటీఏ(బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్) నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బీసీ భవన్లో బీసీటీఏ డైరీ, క్యాలెండర్‌ను కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు, క్రీమీలేయర్ వి ధానం ఎత్తివేత, వేతనంతో కూడిన సె లవుల మంజూరు తదితర అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని బీసీటీఏ సభ్యులు కోరారు. కార్యక్రమంలో బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు నారాయణయాదవ్, కార్యదర్శి రాందాస్ పాల్గొన్నారు.