హైదరాబాద్, మార్చి28 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే అమలులోకి తేవాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు. ఇది కేవలం చట్టపరమైన అంశంకాకుండా, బీసీల హకుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యగా పేర్కొన్నారు. బీసీల హామీలను అమలు చేయకుంటే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ హకుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో 58 మంత్రిత్వశాఖలతో పాటు, 93 విభాగాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఓబీసీల సంక్షేమం, అభివృద్ధిని చూసేందుకు ప్రత్యేక విభాగంలేదని తెలిపారు. జనాభాలో 56 శాతమున్న బీసీలకు ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.