హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అవకాశవాది అని, రహస్య ఎజెండాతో బీసీవాదం పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో విమర్శించారు. కుల వర్గ విభేదాలతో బీసీలకు రాజ్యాధికారం సాధ్యంకాదని, సర్వకుల సమ్మేళనమే బీసీ రాజ్యాధికారానికి పునాది అని పేర్కొన్నారు. బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరో వర్గాన్ని దూషించడం సరికాదని, అది బీసీలకే అప్రదిష్టను తెచ్చిపెడుతుందని తెలిపారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన ఘటనను బీసీలకు ఆపాదించడం సరికాదని, బీసీలు దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో తనను ఎమ్మెల్సీగా గెలిపించిన పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలను మల్లన్న తుంగలో తొకి, మళ్లీ ఇప్పుడు బీసీ వాదం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అహంకారంతో ఇతరులపై వ్యక్తిగత దూషణ, హేళన , దుర్భాషలాడటం, అమానవీయంగా వ్యవహరించాడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అవకాశం కోసం మల్లన్న బీసీ ఉద్యమ ముసుగు వేసుకొన్నాడని, ఇకనైనా నిజాయితీగా కొనసాగితే ఆయనకు మంచి ఫలితాలు ఉంటాయని హితవు పలికారు.