వరంగల్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల వాటాను అమలు చేయకపోతే రాష్ట్రం రణరంగమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ‘బీసీ రాజకీయ రణభేరి’ బహిరంగసభలో ఆర్ కృష్ణయ్య ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా రాజ్యాంగాన్ని మార్చాలని, సుప్రీంకోర్టును ఒప్పించాలని అన్నారు.
రాష్ట్రంలో బీసీ బంధు పథకాన్ని అమలు చేసి ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటాలతోనే బీసీలకు చదువు, ఉద్యోగాల్లో వాటా దక్కిందని, ఇదేమార్గంలో రాజకీయ వాటాను దక్కించుకోవాలని చెప్పారు. కులాల వారీగా కాకుండా బీసీలంతా ఒక్కటిగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పారు. అధిక జనాభా ఉన్న బీసీ వర్గం నుంచి రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క ముఖ్యమంత్రి కాలేకపోయారని, సమర్థత ఉన్నా బీసీ అయిన కారణంగానే మన వర్గాలకు ఈ పదవి దక్కడంలేదని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు బీసీలు అయితేనే ఈ వర్గం వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీల రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టేవరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
బీసీలకు న్యాయపరమైన వాటా ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్ పేరుతో రెండు,మూడు శాతం ఉన్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని డీఎంకే రాజ్యసభ సభ్యు డు విల్సన్ అన్నారు. తమిళనాడులో ఇప్పటివరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయలేదని, ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో బీసీలకు 69 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి బీసీ బలం చూపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం, బీపీ మండల్ మనుమడు సూరజ్‌మండల్, ఎమ్మెల్సీ అభ్యర్థులు సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, పూల రవీందర్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, కార్యదర్శులు కూరపాటి రమే శ్, కుమార్‌యాదవ్, అశోక్‌కుమార్, పులి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.