హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తుది దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలను రాజకీయంగా సమాధి చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్, కన్వీనర్ విజయ్కుమార్గౌడ్, వైస్ చైర్మన్ దుర్గయ్య మీడియాతో మాట్లాడారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను బొందపెట్టాలని కోరారు. చట్టసభల్లో మాట్లాడకుండా గల్లీలో చెడుగుడు ఆడుతున్న పార్టీలను సర్పంచ్ ఎన్నికల్లో బీసీలంతా కలిసి ఓట్లతో చెడుగుడు ఆడాలని పిలుపునిచ్చారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని సూచించారు.
కాంగ్రెస్ నాయకులు రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్లోబల్ సమ్మిట్, మెస్సీతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీల వాటా ఎంతో తేల్చాలని డిమాండ్చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 16 రోజులు గడుస్తున్నా.. ఒక ఎంపీ కూడా బీసీల రిజర్వేషన్లపై మాట్లాడటం లేదని, ఇండియా కూటమి, అధికార బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. బీసీ కులవృత్తులు నిర్వీర్యం అవుతున్నా పట్టించుకున్న దిక్కే లేదని ధ్వజమెత్తారు. గ్రామాల్లో విచ్ఛిన్నకర శక్తులు బీసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నా, ఎన్నికల్లో అధిక స్థానాలు బీసీలు గెలుస్తున్నారని పేర్కొన్నారు. నేటి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వచ్చేందుకు బీసీలు ఐక్యంగా ఉండాలని సూచించారు.