హైదరాబాద్ జూలై 15 (నమస్తే తెలంగాణ) : బీసీలను నిలువునా దగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలపై బీసీ నేతలు కన్నెర్రజేశారు. బిల్లులు, చట్టాలు, ఆర్డినెన్స్ అంటూ బీసీ కోటాపై దోబూచులాడుతున్న రేవంత్ సర్కార్ తీరును తూర్పారబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మేధావులు, బీసీ నేతలు, ప్రజాసంఘాల, కుల సంఘాల నా యకులు పాల్గొని బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా కొట్లాడుతామని తేల్చిచెప్పారు. మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది బీసీ బిడ్డలు తరలివచ్చి రేవంత్ సర్కారుపై సమరశంఖం పూరించారు. ‘జై బీసీ..జైజై బీసీ ‘సాధిద్దాం..సాధిద్దాం.. బీసీ కోటా సాధిద్దాం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచీ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లిప్త, నిర్లక్ష్య ధోరణిని ఎత్తిచూపారు. హస్తం పార్టీ ఇచ్చిన మాట నిలుపుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అటు కేంద్రంలో బీజేపీని సైతం వదిలిపెట్టబోమని, బీసీ బిల్లుల చట్టబద్ధత కోసం ఎంతవరకైనా ముందుకుపోతామని తేల్చిచెప్పారు. అవసరమైతే త్వరలో ఢిల్లీలోనూ ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు.
2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోసం బీసీలకు కాంగ్రెస్ అనేక హామీలిచ్చింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను ఇప్పింది. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని డబ్బా కొట్టింది. మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా బీసీలను మభ్యపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించి చేతులు దులుపుకొన్నది. ఆ తర్వాత అనేక సార్లు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లినా ఒక్కసారి కూడా ప్రధాని మోదీని, రాష్ట్రపతిని బీసీల రిజర్వేషన్లపై అడిగింది లేదు.
ప్రతిపక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లి కొట్లాడింది లేదు. అటు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం బీసీ రిజర్వేషన్లపై ఏనాడూ రాజ్యసభలో మాట్లాడింది లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు విధించడంతో కాంగ్రెస్ సర్కారు బీసీ కోటాపైఆర్డినెన్స్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపింది. ఇప్పుడు ఏదో ఒకటి చేయకుంటే బీసీల నుంచి ప్రతిఘటన తప్పదని భావించి ఆ వర్గం వారిని ఏమార్చేందుకు కొత్త పల్లవి అందుకున్నది. బీసీ బిల్లులకు పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం అసాధ్యమని తెలిసి ఆర్డినెన్స్ అంటూ కొత్త పాట పాడుతున్నది. ఆర్డినెన్స్ అనేది చట్టబద్ధంగా నిలబడదని తెలిసీ ఎన్నికల గండం గట్టెక్కేందకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న 32 శాతం కూడా అమలు చేయకుండా మొత్తానికే రిజన్వేషన్లను అటకెక్కించే కుట్రలకు తెగబడుతున్నది.
కోటాను ఎగ్గొట్టే కుట్రలు : జస్టిస్ ఈశ్వరయ్య
ముఖ్యమంత్రి అంటే ఒక్క రెడ్లకే కాదు.. బీసీలకు, రాష్ట్ర ప్రజలందరికీ అనే విషయాన్ని రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలి. ఆయన బీసీలకు అందించిన కాగడాను పట్టుకొని హక్కులను సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దిశగా యుద్ధానికి నాంది పలుకుదాం.
దగా చేసింది కాంగ్రెస్సేబీసీలు భారతదేశంలో రెండో శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారంటే ఇందుకు కాంగ్రెస్ పార్టీయే కారణం. 60 ఏండ్లు అధికారం వెలగబెట్టి కులగణన చేయకుండా, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా, సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయకుండా దగా చేసింది.
-సిరికొండ మధుసూదనాచారి
దామాషా ప్రకారం ఇవ్వాలి: చిరంజీవులు
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పెద్దసంఖ్యలో ధర్నాకు తరలివచ్చిన వారి చైతన్యం చూస్తుంటే తెలంగాణలో త్వరలోనే బీసీల రాజ్యం వచ్చే సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తున్నది. బీసీలకు 42 శాతం కోటా సరిపోదు. జనాభా దామాషా ప్రకారం 60 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.