రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమని ఓసారి.. పార్టీపరంగా అని మరోసారి.. బిల్లుల ద్వారా ఇస్తామని ఇంకోసారి.. ఆర్డినెన్స్ అని ఓనాడు.. రాహుల్ ప్రధానమంత్రి ఆయిన తర్వాత అని ఇంకోనాడు.. జీవో ద్వారా అని మరోనాడు.. ఇట్ల ఒకే అంశంపై ఐదు విధాలుగా మాట్లాడటం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. -కేటీఆర్
బంద్‌కు మద్దతు కోరిన బీసీ సంఘాల నేతలతో కలిసి బుధవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తేతెలంగాణ): బీసీలకు 42 శాతం కోటాపై కాంగ్రెస్ డ్రామాలాడుతున్నదని, ఐదు రకాలుగా మాట్లాడుతూ.. రోజుకో తీరుగా వ్యవహరిస్తూ తప్పులపై తప్పులు చేస్తూ తప్పించుకుంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి అసెంబ్లీలో బిల్లులు పెట్టేదాకా తప్పుడు మార్గంలో వెళ్తూ బీసీ సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. రేవంత్ అధికారంలో ఉన్నన్ని రోజులు బీసీలకు రిజర్వేషన్ కోటా దక్కదని, బడ్జెట్లో నిధులు రావని, కాంట్రాక్టుల్లో న్యాయమైన వాటా దక్కదని తేల్చిచెప్పారు.
ఈ నెల 18న తలపెట్టనున్న బీసీ జేఏసీ బంద్‌కు మద్దతివ్వాలని చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల ప్రతినిధులు కేటీఆర్‌ను బుధవారం తెలంగాణ భవన్లో కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బీసీలు, ఇతర బలహీనవర్గాల మేలు కోసం పరితపించిన నాయకుడు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్ అని చెప్పారు. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తిచేశారని గుర్తుచేశారు. ఏనాడూ ఆయన రాజకీయ లబ్ధికోసం పాకులాడలేదని స్పష్టంచేశారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం బలహీనవర్గాల ఓట్ల కోసం రిజర్వేషన్ల పేరిట నాటకాలాడుతున్నదని మండిపడ్డారు. చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నదని తూర్పారబట్టారు.
బీసీలకు నాటి నుంచి నేటి వరకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీయే.. బీసీ రిజర్వేషన్లపై మా పార్టీ విధానాన్ని స్పష్టంగా చెప్పినం. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా కోటా అమలు చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేస్తే మద్దతిచ్చినం. రాజ్యాంగ సవరణతోనే కోటా సాధ్యమని చెప్పినం. అనేక విలువైన సలహాలు, సూచనలిచ్చినం. -కేటీఆర్
మాటలు మార్చి బీసీలకు మోసం
బీసీ రిజర్వేషన్లపై పదే పదే మాటలు మార్చుతూ కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకే పార్టీ ఐదు విధాలుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పూటకో విధానంతో బలహీనవర్గాలను దగా చేస్తున్నదని దుయ్యబట్టారు. బీసీ కోటాపై బీఆర్ఎస్ది మొదటినుంచీ ఒకే విధానమని పునరుద్ఘాటించారు. మోదీ, రాహుల్ ఇద్దరూ కూర్చొని మాట్లాడితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని, నిమిషంలోనే ఈ వ్యవహారం తేలిపోతుందని చెప్పారు. ఇండియా, ఎన్డీయే కూటములు కలిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
హామీలు నెరవేర్చేదాకా నిలదీస్తం
బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ చిత్తశుద్ధిని అటు ప్రజాక్షేత్రంలో ఇటు చట్టసభల్లో ఎండగడతామని తేల్చిచెప్పారు. ఏటా బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు పెట్టేదాకా, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించేదాకా, సివిల్ కాంట్రాక్టులు, మద్యం దుకాణాల కేటాయింపులో 42 శాతం కోటా ఇచ్చేదాకా వెంటపడుతామని చెప్పారు.
బీసీలకు అన్నింటా వాటా దక్కాలి
బీసీలకు ఒక్క స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు దక్కినంత మాత్రనా బీసీ సమాజంలో సమూల మార్పులు రావని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, బడ్జెట్లో 20 శాతం నిధులు వస్తేనే ఆశించిన మేలు జరుగుతుందని చెప్పారు. బీసీ సంఘాలు సైతం ఈ దిశగా పోరాటం సాగించాలని విజ్ఞప్తిచేశారు. వారితో కలిసివచ్చేందుకు బీఆర్ఎస్ సంసిద్ధంగా ఉన్నదని ప్రకటించారు.
పదేండ్ల పాలనలో బీసీలు, ఇతర బలహీనవర్గాల మేలు కోసం కేసీఆర్ పరితపించిండ్రు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని కోరిన దేశంలోనే ఏకైక నాయకుడు కేసీఆర్. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిండ్రు. ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేసిండ్రు. కానీ ఏనాడు కాంగ్రెస్ తరహాలో ప్రచారం చేసుకోలె.. రాజకీయ లబ్ధికోసం
పాకులాడలె.. -కేటీఆర్
బీసీల పోరాటానికి సంపూర్ణ మద్దతు
బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ ప్రకటించారు. ఈ నెల 18న తలపెట్టిన బీసీ జేఏసీ బంద్‌కు సహకరిస్తామని స్పష్టంచేశారు. పార్లమెంట్లో బిల్లుపెడితే రాజ్యసభలో తమ ఎంపీలు మద్దతిస్తారని చెప్పారు. బీసీ సంఘాలతో కలిసి ప్రధాని మోదీని కలిసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. బీసీ సంఘాల నాయకులు, పార్టీలు ఏకమై తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని సూచించారు.