Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): పార్టీ రాజకీయాల పరంగా తనతో విభేదించినప్పటికీ, కులగణన విషయంలో తనకు సహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేడుకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిసి రావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో జరిగిన కులగణన సర్వే, బీసీ జనాభా నివేదిక పెద్ద బోగస్ అని, అంతా తప్పులతడక అని కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, తాజాగా మాజీ ఎంపీ మధుయాష్కీ కులగణన సర్వే తీరుపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి ఒకరు కులగణన సర్వే తీరు మీద రాహుల్‌గాంధీకి నెగిటివ్ రిపోర్టు ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కులగణన తప్పులతడక అని బరాబర్ ఢిల్లీ అధిష్ఠానానికి తాను ఫిర్యాదు చేసినట్టు తీన్మాన్ మల్లన్న బహిరంగంగానే చెప్పారు. కానీ, ఇప్పటివరకు మధుయాష్కీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారు
కులగణన తన డ్రీమ్ ప్రాజెక్టు అని రాహుల్‌గాంధీ ముందుగానే సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో వచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా అమలుచేయాలనే ఆలోచనతో ఉన్నామని, ఇక్కడ చేపట్టబోయే కులగణన పైలట్ ప్రాజెక్టు లాంటిదని ఆయన ఒకటికి రెండుసార్లు విడమరిచి చెప్పినప్పటికీ, రేవంత్‌రెడ్డి పెడచెవిన పెట్టినట్టు బీసీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీసీ జనాభాను తేల్చడానికి రాక రాక వచ్చిన అవకాశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టించారని, అగ్రకులాల వారికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికే బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారని కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఈ నేపథ్యంలో కులగణన తప్పిదాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా కులగణనను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చూస్తున్న రాహుల్‌గాంధీకే నేరుగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూసే ఒక మాజీ నేత ద్వారా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అగ్రనేతను కలిసినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 2014లో కేసీఆర్ చేసిన ఎస్కేఎస్ సర్వే, ఇటీవల రేవంత్‌రెడ్డి చేసిన కులగణన సర్వే నివేదికలను వారి ముందు పెట్టి బీసీ కులాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించినట్టు తెలిసింది. అప్పట్లో కేసీఆర్ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా పక్కగా సర్వే చేశారని, దుబాయ్, ముంబైలో ఉన్న వాళ్లు కూడా వచ్చి అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారని, అది కరెక్టు సర్వే అని తీన్మార్ మల్లన్న రాహుల్‌గాంధీకి వివరించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన సర్వేలో బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఊహించనంత అప్రతిష్ఠ
శనివారం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలపాటు చర్చ జరిగినట్టుగా సమాచారం. కులగణన సర్వే తీరుతెన్నులు, బీసీ జనాభా నివేదిక బయటపెట్టిన తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బీసీ సంఘాల అభిప్రాయాలు, కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతల అభిప్రాయాల మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. అనంతరం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై చర్చించినట్టు సమాచారం. రైతు రుణమాఫీ, కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీ మైలేజ్‌ని పెంచాల్సిన పథకాలని, కానీ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, దుడుకు స్వభావంతో ఊహించనంత అప్రతిష్ఠ మూటగట్టుకున్నామని మధుయాష్కీ వివరించినట్టు తెలిసింది. దీనిపై మధుయాష్కీ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
బీసీ లెక్కలు తప్పని చెప్పా: తీన్మార్ మల్లన్న
కులగణన చేసి నివేదిక బయటపెట్టిన తరువాత తనకున్న పరిచయాలతో ఢిల్లీతో కనెక్టయ్యానని తీన్మార్ మల్లన్న బహిరంగ వేదిక మీద ప్రకటించారు. సర్వే ద్వారా తేల్చిన బీసీల లెక్కలు తప్పు అని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తన ఫిర్యాదుతోనే ఢిల్లీ పెద్దలు పిలవాల్సిన వాళ్లను పిలిచినట్టు పేర్కొన్నారు. అక్కడినుంచి వచ్చాకే కులగణన మళ్లీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు.