రవీంద్రభారతి, సెప్టెంబర్ 5: కాంగ్రెస్ 76 ఏండ్ల పాలనలో బీసీలను రాజకీయంగా అణగదొక్కుతూ తీరని ద్రోహం చేస్తూ వచ్చిందని బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మీడియా సమావేశంలో చిరంజీవులు మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి బీసీ నేతలకు నాడు కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించిందని మండిపడ్డారు.
బీసీ బిడ్డను సీఎం, డిప్యూటీ సీఎం చేయలేదని చేయలేకపోయిందని తెలిపారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడూతూ ఈ నెల 29న బీసీ బహుజన ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వీజీఆర్, బీసీ జాక్ వైస్ చైర్మన్ కృష్ణ, మనఆలోచన సమితి అధ్యక్షుడు నరసింహారావు, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరావు పాల్గొన్నారు.