Rajaram Yadav | ఖైరతాబాద్, మార్చి 20 : సినిమాల్లో ఎందరో గొప్ప గొప్ప నటులను చూశామని, కాని సీఎం రేవంత్ రెడ్డి అంతపెద్ద యాక్టర్ ఎక్కడా ఉండరని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ ఎద్దేవా చేశారు. ‘బీసీ బిల్లు, స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో తక్షణమే అమలు కోసం ఉద్యమ కార్యాచరణ’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు వల్ల ఆ వర్గాలకు ఫలాలు దక్కుతాయా అన్న అనుమానం కలుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి తాన అంటే… ఆయన చుట్టూ ఉన్న బీసీ నాయకులు తందాన అంటున్నారని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆయన రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయించి బీసీల సంఖ్య 63.13 శాతం ఉన్నట్లు నిర్ధారించారన్నారు. ఆ వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ కూడా చేశారన్నారు. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆ వర్గాలను మోసం చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఓ వైపు బిల్లు పాసైందని చెబుతూనే మరో వైపు 9వ షెడ్యూల్ అంటూ, ఇంకో వైపు అంతా కేంద్రంలో చేతుల్లో ఉందని చెప్పుకొస్తున్నారని ఆరోపించారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ నాడు రామచంద్ర కమిషన్ వేసి 44 శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించారని గుర్తు చేశారు. కాని రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్లేయరైనంత మాత్రాన రిజర్వేషన్ల బంతి కేంద్రం కోర్టులో ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఎన్టీఆర్, నితీశ్ కుమార్ స్ఫూర్తిగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఢిల్లీ పోదామంటూ యాక్టింగ్ చేయడం మానుకోవాలన్నారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే తక్షణమే జీవో తీసుకువచ్చి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల ద్వారా పది శాతం పోయిందని, ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం ఫలాలు అందుతున్నాయని, కాని బీసీలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.
ఈ నెల 27న బీసీ మేథావులు, కుల సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, ఏప్రిల్ 12న వేలాది మందితో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తామన్నారు. ప్రభుత్వం మళ్లీ బీసీలను మోసం చేయాలని చూస్తే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా మరో ఉద్యమానికి సిద్దమవుతామన్నారు. ఈ సమావేశంలో బీసీ హిందూ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్, బీసీ అడ్వకేట్ జేఏసి అధ్యక్షులు గోవర్ధన్, ఓయూ జేఏసి అధ్యక్షులు డాక్టర్ ఏల్చల దత్తాత్రేయ, బీసీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు మేల కృష్ణ, బీసీ ఆజాద్ సంఘ్ అధ్యక్షులు మహేశ్ గౌడ్, విద్యార్ధి నిరుద్యోగ సమాఖ్య అధ్యక్షులు కొంపల్లి రాజు, జక్కుల మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.